Loading...
Gurnoor Brar: భారత పేసర్ గుర్నూర్ బ్రార్‌కు ఐసీసీ హెచ్చరిక.. అసలు ఏం జరిగిందంటే?
భారత పేసర్ గుర్నూర్ బ్రార్‌కు ఐసీసీ హెచ్చరిక.. అసలు ఏం జరిగిందంటే?

Gurnoor Brar: భారత పేసర్ గుర్నూర్ బ్రార్‌కు ఐసీసీ హెచ్చరిక.. అసలు ఏం జరిగిందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2026
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ పేసర్ గుర్నూర్ బ్రార్ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే సందర్భంగా చేసిన అనుచిత ప్రవర్తనకు ఐసీసీ నుంచి అధికారిక హెచ్చరిక అందుకున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9 (లెవల్-1) ఉల్లంఘన కింద అతడిపై ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేశారు. గత 24 నెలల్లో ఇదే అతడి తొలి క్రమశిక్షణా ఉల్లంఘన కావడంతో కఠిన చర్యలు తీసుకోకుండా హెచ్చరికతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టారు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ఈ చర్యను ప్రతిపాదించగా, బ్రార్ తన తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేకుండానే ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

వివరాలు

అసలు ఏం జరిగింది?

తొలి వన్డేలో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అంతకుముందు బ్రార్ వేసిన బంతిని డకెట్ బౌండరీకి తరలించడంతో భారత బౌలర్ కొంత అసహనానికి గురయ్యాడు.

ఆ తర్వాతి బంతిని డకెట్ తిరిగి బ్రార్ వైపు ఆడగా, అతడు బంతిని తీసుకుని డకెట్‌కు అత్యంత సమీపంగా విసిరాడు. ప్రత్యర్థి ఆటగాడి వైపు ఈ విధంగా బంతిని విసరడాన్ని ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించింది.

ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ నివేదిక సమర్పించగా, ఐసీసీ కమిటీ లెవల్-1 నిబంధనల ప్రకారం అధికారిక హెచ్చరికతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.

వివరాలు

రెండు వికెట్లు పడగొట్టిన బ్రార్

సాధారణంగా ఇలాంటి ఉల్లంఘనలకు ఆటగాడి మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు జరిమానా, అలాగే ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉంటుంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, గుర్నూర్ బ్రార్ 9 ఓవర్లు బౌలింగ్ చేసి 61 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

అయితే తన చివరి ఓవర్‌ను పూర్తి చేసే సమయంలో మడమకు గాయం కావడంతో మధ్యలోనే మైదానం వీడి డగౌట్‌కు వెళ్లాల్సి వచ్చింది.

ADVERTISEMENT