Loading...
Sunil Gavaskar: విరాట్ సెంచరీకి దగ్గరగా ఉంటే ఆ ఇద్దరికీ చిక్కులే.. గావస్కర్ కామెంట్స్
విరాట్ సెంచరీకి దగ్గరగా ఉంటే ఆ ఇద్దరికీ చిక్కులే.. గావస్కర్ కామెంట్స్

Sunil Gavaskar: విరాట్ సెంచరీకి దగ్గరగా ఉంటే ఆ ఇద్దరికీ చిక్కులే.. గావస్కర్ కామెంట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ (74) అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఒకవేళ కోహ్లీ సెంచరీకి చేరువలో ఉండి ఉంటే టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అయోమయ పరిస్థితిని ఎదుర్కొనేవాడని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ 70లలోనే ఔట్ కావడంతో ఆ పరిస్థితి తప్పిందని పేర్కొన్నారు.

వివరాలు

రికార్డుల కోసం ఆడటంలో తప్పులేదు!

భారత క్రికెట్ అభిమానులకు రికార్డులంటే ఎప్పుడూ ఆసక్తేనని గావస్కర్ అన్నారు. రికార్డుల కోసం ప్రయత్నించడం సరైందా? కాదా? అనే చర్చ తరచూ జరుగుతూనే ఉంటుందని చెప్పారు.

అయితే, రికార్డుల కోసం ఆడటం లేదని చెప్పేవారిలో 99 శాతం మందికి వాటిని సాధించే ప్రతిభ లేదా మానసిక బలం ఉండదని అభిప్రాయపడ్డారు.

విరాట్ కోహ్లీ 100అంతర్జాతీయ సెంచరీల మార్కును చేరుకోవాలని ప్రతి భారత అభిమాని కోరుకుంటాడని తెలిపారు.

అతడు ఆ ఘనత సాధిస్తే చూడాలని అందరూ ఆశిస్తారని చెప్పారు. కొన్నిసార్లు జట్టులోని సహచరులు తమ పరుగులను పక్కనపెట్టి మరీ మరో ఆటగాడి సెంచరీకి సహకరిస్తుంటారని గుర్తుచేశారు.

అలాంటి సందర్భంలో కోహ్లీ సెంచరీ సాధిస్తే అది అతడి వ్యక్తిగత ఘనత మాత్రమే కాదని గావస్కర్ పేర్కొన్నారు.

వివరాలు

కోహ్లీ ఔట్ కావడంతో గిల్‌కు తప్పిన సందిగ్ధత!

తొలి వన్డేలో కోహ్లీ 70ల స్కోరు వద్ద ఔటయ్యాడు. ఒకవేళ అతడు 90ల్లో ఉండి ఉంటే శుభ్‌మన్ గిల్ లేదా శ్రేయస్ అయ్యర్ పరుగులు చేయాలా? వద్దా?అనే సందిగ్ధంలో పడేవారని గావస్కర్ విశ్లేషించారు.

వారిలో ఎవరైనా వేగంగా పరుగులు సాధించి ఉంటే అభిమానుల నుంచి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఉండేదని అభిప్రాయపడ్డారు.

కోహ్లీ ఔట్ కావడంతో గిల్, శ్రేయస్‌లకు అలాంటి అయోమయం తప్పిందని, అభిమానుల నుంచి వచ్చే విమర్శల ప్రమాదం కూడా లేకుండా పోయిందని పేర్కొన్నారు.

అయితే జట్టులోని సహచరుల్లో ఎవరైనా సెంచరీ సాధించడం జట్టుకు కూడా ఉపయోగకరమేనని గావస్కర్ అన్నారు.

అదే సమయంలో వ్యక్తిగత రికార్డుల కోసం ప్రయత్నించే క్రమంలో జట్టు విజయంపై ప్రభావం పడకుండా చూసుకోవాలని సూచించారు.

ADVERTISEMENT