IND vs WI: వెస్టిండీస్ తో నేడే రెండో వన్డే.. సిరీస్‌పై భారత్ గురి!
వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మొదటి వన్డేలో గెలిచి భారత్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు జరిగే రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఓ వైపు ఆసియా కప్.. మరోవైపు వన్డే వరల్డ్‌కప్.. ఈ రెండింటి ప్రిపరేషన్స్‌లో ఉన్న టీమిండియా యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనుకున్న నేపథ్యంలో రెండో వన్డేలోనూ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మొట్టమొదటిసారి ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ సొంతగడ్డపై కనీస పోరాటంతో పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. మొదటి వన్డే లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ధాటికి విండీస్ 114 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే.
మొదటి వన్డే జట్టుతోనే టీమ్‌ఇండియా.. సంజూకు మరోసారి నిరాశే
మొదటి వన్డేలో కుల్దీప్ యాదవ్,రవీంద్ర జడేజా ధాటికి విండీస్ 114 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా తడబడటమే ఆందోళన కలిగిస్తోంది. రెండో వన్డేల్లో ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోసారి సంజూ శాంసన్‌కు నిరాశ తప్పకపోవచ్చు. బార్బడోస్ వేదికగానే రెండో వన్డే జరుగుతుండడంతో భారత బౌలర్లు మరోసారి చెలరేగే అవకాశం ఉంది. మొదటి వన్డేలో రాణించిన కుల్దీప్, జడేజా మరోసారి విండీస్ ను తమ బౌలింగ్ తో ఇబ్బందులు పెడతారేమో చూడాలి. పేసర్లు ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్, హార్దిక్ కూడా బౌలింగ్ లో పర్వాలేదనిపించారు.
వెస్టిండీస్,టీమిండియా తుది జట్ల అంచనా
బార్బడోస్ వేదికగా శనివారం జరిగే రెండో వన్డే రాత్రి 7 గంటల నుండి డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.మ్యాచ్ ఆరంభంలో పేస్‌కు సహకరించనున్న పిచ్.. ఆ తర్వాత స్పిన్నర్లకు స్వర్గధామంలా మరనుంది. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్. వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్ (కెప్టెన్), కీసీ కార్టీ, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, డొమినిక్ డ్రేక్స్, యానిక్ కారియా, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్.