Loading...
Ryan ten Doeschate: టీమిండియా కోచింగ్‌ స్టాఫ్‌లో మార్పులు?.. ర్యాన్‌ టెన్‌ డస్కటే వైదొలగనున్నారా?
ర్యాన్‌ టెన్‌ డస్కటే వైదొలగనున్నారా?

Ryan ten Doeschate: టీమిండియా కోచింగ్‌ స్టాఫ్‌లో మార్పులు?.. ర్యాన్‌ టెన్‌ డస్కటే వైదొలగనున్నారా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ ఆడుతోంది. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేక వైట్‌వాష్‌కు గురైంది. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా కోల్పోవడంతో జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌తో పాటు ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై కూడా అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టీమ్‌ఇండియా కోచింగ్‌ బృందంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని క్రికెట్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డస్కటేతో పాటు ఫీల్డింగ్‌ కోచ్‌ టీ. దిలీప్‌ తమ బాధ్యతలకు వీడ్కోలు చెప్పే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

ఫీల్డింగ్‌ కోచ్‌ రాజీనామాపై కూడా చర్చ

క్రికెట్‌ వర్గాల సమాచారం ప్రకారం, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ ముగిసిన వెంటనే అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డస్కటే తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

వ్యక్తిగత కారణాల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు, ఇటీవల ఫీల్డింగ్‌లో భారత జట్టు వరుసగా నిరాశపరిచే ప్రదర్శన చేయడంతో ఫీల్డింగ్‌ కోచ్‌ టీ. దిలీప్‌ కూడా తన పదవిని వీడే అవకాశాలపై చర్చ కొనసాగుతోంది.

దాదాపు రెండేళ్ల క్రితం ర్యాన్‌ టెన్‌ డస్కటే టీమ్‌ఇండియా అసిస్టెంట్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.

అయితే ఆయన రాజీనామా నిర్ణయాన్ని ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అంగీకరించలేదని కూడా సమాచారం వెలువడుతోంది.

వివరాలు 

వచ్చే వన్డే ప్రపంచకప్‌ వరకు గౌతమ్‌ గంభీర్‌ 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో గంభీర్‌ మెంటార్‌గా వ్యవహరించిన సమయంలో ర్యాన్‌ టెన్‌ డస్కటే కోచింగ్‌ బృందంలో భాగంగా పనిచేశారు.

ఆ అనుబంధంతోనే గంభీర్‌ టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ర్యాన్‌కు కూడా కోచింగ్‌ సిబ్బందిలో చోటు కల్పించారు.

ప్రస్తుతం గౌతమ్‌ గంభీర్‌ పదవీకాలం వచ్చే వన్డే ప్రపంచకప్‌ వరకు కొనసాగనుంది.

ఆ సమయం వరకు ర్యాన్‌ టెన్‌ డస్కటే తనతోనే కొనసాగాలని గంభీర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా,ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా విజయాన్ని సాధిస్తే ర్యాన్‌ టెన్‌ డస్కటే భవిష్యత్‌పై నెలకొన్నఅనిశ్చితి కొంతవరకు తొలగే అవకాశముందని క్రికెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే,కోచింగ్‌ బృందంలో మార్పులపై ఇప్పటివరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ADVERTISEMENT