Hockey World Cup: అమ్మాయిలకు నిరాశ.. నెదర్లాండ్స్ చేతిలో భారత్ ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. సెమీఫైనల్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంటూ.. పూల్-డి తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో 0-2తో ఓటమిపాలైంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఒలింపిక్ ఛాంపియన్ డచ్ జట్టు ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే నెదర్లాండ్స్ గోల్ సాధించింది. పెనాల్టీ కార్నర్‌ను యిబీ జాన్సెన్ సద్వినియోగం చేసుకుంది. ఆమె కొట్టిన శక్తివంతమైన షాట్ నేరుగా గోల్‌లోకి దూసుకెళ్లడంతో భారత్ ఆత్మరక్షణలో పడిపోయింది. ఆ తర్వాత కూడా నెదర్లాండ్స్ దాడులు కొనసాగించింది. బంతి ఎక్కువగా భారత గోల్ సమీపంలోనే కనిపించింది. భారత డిఫెండర్లు, గోల్‌కీపర్ సవితకు పదేపదే పరీక్ష ఎదురైంది.
వివరాలు
నెదర్లాండ్స్ ఆధిక్యం..
13వ నిమిషంలో నెదర్లాండ్స్ మరో గోల్ చేసే అవకాశం కోల్పోయింది.
యీబి జాన్సెన్ కొట్టిన షాట్ గోల్ బార్‌కు తగిలి పక్కకు వెళ్లిపోయింది.
రెండో క్వార్టర్‌లో భారత్ కాస్త పుంజుకుంది. 18వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ దక్కించుకుంది.
అయితే దీపిక కొట్టిన షాట్‌ను నెదర్లాండ్స్ డిఫెండర్లు అడ్డుకున్నారు.
మరోవైపు డచ్ జట్టు కూడా దాడులను కొనసాగించింది. 32వ నిమిషంలో నెదర్లాండ్స్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా.. దాన్ని గోల్‌గా మలచలేకపోయింది.
అయితే ఆ జట్టు ఎటాకింగ్ ఆటకు 38వ నిమిషంలో ఫలితం దక్కింది.
మరో పెనాల్టీ కార్నర్‌ను మాల్టా గోల్‌గా మలచడంతో నెదర్లాండ్స్ ఆధిక్యం 2-0కు పెరిగింది.
వివరాలు
తృటిలో తప్పిన అవకాశం..
మూడో క్వార్టర్ చివర్లో నెదర్లాండ్స్‌కు షాక్ తగిలింది. సాండర్స్‌కు రిఫరీ గ్రీన్ కార్డు చూపించి బయటకు పంపడంతో డచ్ జట్టు కొంతసేపు పది మందితోనే ఆడాల్సి వచ్చింది.
అయితే భారత్ ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది.
చివరి 15 నిమిషాల్లో సలీమా బృందం గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది.
కానీ ఫినిషింగ్‌లో విఫలమైంది. నెదర్లాండ్స్ డిఫెన్స్‌ను ఛేదించలేక కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది.
మరోవైపు చివరి నిమిషాల్లోనూ భారత జట్టు ప్రత్యర్థి దాడులను అడ్డుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది.
48, 57వ నిమిషాల్లో నెదర్లాండ్స్‌కు మరో రెండు గోల్స్ చేసే అవకాశాలు వచ్చినా.. అవి తృటిలో తప్పిపోయాయి. లేకపోతే భారత్ మరింత భారీ తేడాతో ఓడిపోయేది.
వివరాలు
ఆస్ట్రేలియా, చైనా 1-1తో డ్రా..
ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఏకంగా 10 పెనాల్టీ కార్నర్లు సాధించగా.. భారత్‌కు కేవలం రెండు మాత్రమే లభించాయి.
ఈ ఓటమితో భారత జట్టు సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
భారత్ తన తదుపరి కీలక మ్యాచ్‌లో ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.
సెమీఫైనల్ దిశగా ముందుకు సాగాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం కీలకం కానుంది.
ఇక మరో పూల్-డి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, చైనా 1-1తో డ్రాగా నిలిచాయి.