WTC 2025-27: బంగ్లాదేశ్ కంటే వెనుకబడ్డ భారత్.. గిల్ సేనకు ఇప్పుడు ప్రతి టెస్టు నాకౌట్ మ్యాచ్!
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత జట్టు ముందు భారీ సవాలు నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 9 టెస్టుల్లో నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసిన టీమిండియా, 48.15 శాతం పాయింట్లతో (PCT) పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు, ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకబడడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 87.50 PCTతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా (75), న్యూజిలాండ్ (72.22), బంగ్లాదేశ్ (58.33) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ మాత్రం 48.15 PCTతో టాప్-5లోనే నిలిచింది.
వివరాలు
ఇక ఒక్క తప్పిదానికీ అవకాశం లేదు
టీమిండియా ఖాతాలో ఇంకా తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నింటిలో విజయం సాధిస్తే భారత్ పాయింట్ల శాతం 74.07కు చేరి WTC ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకునే అవకాశం ఉంటుంది.
అయితే ఒక్కో ఓటమి కూడా భారీ ప్రభావం చూపనుంది.
1 మ్యాచ్‌లో ఓడితే - PCT 68.50
2 మ్యాచ్‌లు ఓడితే - PCT 62.90
3 మ్యాచ్‌లు ఓడితే - PCT 57.41
WTC నిబంధనల ప్రకారం ప్రతి విజయానికి 12 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లు లభిస్తాయి. అందుకే ఒక్క ఓటమి కూడా ఫైనల్ అవకాశాలను గణనీయంగా దెబ్బతీయొచ్చు.
వివరాలు
ముందున్న షెడ్యూల్ మరింత కఠినం
టీమిండియా ముందున్న టెస్టు షెడ్యూల్ అత్యంత సవాల్‌తో కూడుకున్నది.
ముందుగా శ్రీలంక పర్యటనలో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. అక్కడ స్పిన్ పిచ్‌లపై రాణించడం భారత్‌కు కీలకంగా మారనుంది.
అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో మరో రెండు టెస్టులు ఆడనుంది.
ఆ తర్వాత ప్రపంచ నంబర్-1 టెస్టు జట్టు ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు టెస్టుల భారీ సిరీస్ ఆడాల్సి ఉంది.
వివరాలు
ప్రతి మ్యాచ్ కీలకమే
ఈ పరిస్థితుల్లో భారత్ కేవలం తన మ్యాచ్‌లను గెలవడమే కాకుండా, ఇతర జట్ల ఫలితాలపైనా కొంతవరకు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా ఇకపై ఆడే ప్రతి టెస్టును నాకౌట్ మ్యాచ్‌గా భావించి వరుస విజయాలు సాధిస్తేనే WTC 2025-27 ఫైనల్ చేరే కలను సాకారం చేసుకునే అవకాశం ఉంటుంది.