న్యూజిలాండ్ సిరీస్ పై భారత్ గురి..!
శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్ లను భారత్ కైవసం చేసుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ పై భారత్ కన్ను పడింది. ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగంలో రాణిస్తున్న టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగే పోరుకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ కూడా పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సాధించి, ఆత్మ విశ్వాసంతో ఉంది. వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నారు. జనవరి 18 నుండి మొదలవుతున్న సిరీస్‌లో టీమిండియా మూడు వన్డేల సిరీస్, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. వన్డే సిరీస్‌లలో కనిపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20 సిరీస్‌కి ఎంపిక కాలేదు.
మరో రికార్డుకు చేరువలో కోహ్లీ
స్వదేశంలో జరిగిన వన్డేల్లో భారత్ న్యూజిలాండ్‌పై గట్టి ఆధిపత్యం ఉంది. స్వదేశంలో కివీస్‌తో ఆడిన 35 మ్యాచ్‌ల్లో 26 విజయాలను భారత్ సాధించింది. విరాట్ కోహ్లి తన చివరి నాలుగు వన్డేల్లో మూడు సెంచరీలతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పేసర్ మహ్మద్ సిరాజ్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డే ఫార్మాట్‌లో 1,000 పరుగులు పూర్తి చేసి మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 119 పరుగులు విరాట్ కోహ్లీ చేస్తే అంతర్జాతీయంగా 25వేల పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలవనున్నాడు. మరో ఐదు వికెట్లు తీస్తే 400 అంతర్జాతీయ వికెట్లు తీసిన ఆటగాడిగా షమీ చరిత్రకెక్కనున్నాడు.