China Masters title: చైనాలో భారత కుర్రాళ్ల జోరు.. సూపర్ 750 టైటిల్ కైవసం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి మరోసారి అదరగొట్టింది. కెరీర్‌లో తొలిసారి చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ సూపర్ 750 టైటిల్‌ను కైవసం చేసుకుంది. షెంజెన్‌లో ఆదివారం హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఈ భారత జోడీ అద్భుతంగా పుంజుకుని విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో సాత్విక్-చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కావడం విశేషం. గత నెల సొంతగడ్డపై జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో నిరాశపరిచిన సాత్విక్-చిరాగ్.. చైనా మాస్టర్స్‌లో మాత్రం తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించారు. ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్ 4 జోడీ హె జి టింగ్-రెన్ జియాంగ్ యును 11-21, 21-13, 21-17తో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
వివరాలు
2023, 2025లో రన్నరప్
ఈ టోర్నీలో సాత్విక్-చిరాగ్ జోడీ 2023, 2025లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం ఫైనల్లో విజయాన్ని అందుకుని ట్రోఫీని ముద్దాడింది.
అంతేకాదు.. ఈ ఏడాది మేలో సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను కూడా ఈ జోడీ గెలుచుకుంది.
ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉన్న సాత్విక్-చిరాగ్‌కు చైనా మాస్టర్స్ విజయం మరింత ఉత్సాహాన్నివ్వనుంది.
వివరాలు
తొలి గేమ్‌లో తడబాటు
చైనా జోడీతో గతంలో రెండుసార్లు తలపడిన సాత్విక్-చిరాగ్ రెండుసార్లూ విజయం సాధించారు. అయితే ఈసారి ఫైనల్లో మాత్రం భారత జోడీకి ఆరంభం అనుకున్నంతగా సాగలేదు.
మొదట్లో ర్యాలీలపై నియంత్రణ కోల్పోయిన సాత్విక్-చిరాగ్.. ప్రత్యర్థి దూకుడుకు ఇబ్బంది పడ్డారు. టింగ్-రెన్ జోడీ ఎటాకింగ్ గేమ్‌తో 5-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
కట్టుదిట్టంగా సర్వీస్ చేస్తూ ఒత్తిడి పెంచింది. టింగ్ కొట్టిన స్మాష్‌తో చైనా జంట 8-3తో ఆధిక్యంలో నిలిచింది. భారత జోడీ ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
విరామ సమయానికి చైనా ద్వయం ఆరు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది.
ఆ తర్వాత టింగ్-రెన్ జోడీ ఆధిక్యాన్ని 14-7కు, అనంతరం 17-9కు పెంచుకుంది. చివరికి తొలి గేమ్‌ను అలవోకగా గెలుచుకుంది.
వివరాలు
రెండో గేమ్‌లో అద్భుత పుంజుకున్న భారత జోడీ
రెండో గేమ్‌లో సాత్విక్-చిరాగ్ పూర్తిగా తమ ఆటను మార్చేశారు. డిఫెన్స్‌ను పటిష్టం చేసుకోవడంతో పాటు ర్యాలీలను ఎక్కువసేపు కొనసాగించారు.
సాత్విక్ సర్వీస్‌లోనూ మెరుగ్గా రాణించగా.. మ్యాచ్ నువ్వానేనా అన్నట్టుగా మారింది. చిరాగ్ ప్రత్యర్థి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని కొట్టిన స్మాష్‌తో భారత జంట 9-6తో ఆధిక్యంలోకి వచ్చింది.
వరుసగా ఇది భారత జోడీకి లభించిన ఐదో పాయింట్. అయితే సాత్విక్ చేసిన సర్వీస్ తప్పిదంతో ఆ వరుసకు బ్రేక్ పడింది.
అయినప్పటికీ భారత జంట మళ్లీ పట్టు బిగించి విరామ సమయానికి నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించింది.
తొలి గేమ్‌లో ఎక్కువ ర్యాలీలు 15 షాట్లలోపే ముగియగా.. రెండో గేమ్‌లో భారత జోడీ ర్యాలీలను పొడిగించింది.
వివరాలు
చివరి గేమ్‌లో ఉత్కంఠ
ఏకంగా 45 షాట్ల ర్యాలీలో పైచేయి సాధించిన సాత్విక్-చిరాగ్ 12-8తో ఆధిక్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత 17-11తో నిలిచారు. అదే జోరును కొనసాగిస్తూ రెండో గేమ్‌ను సొంతం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లారు.
దీంతో ప్రతి పాయింట్ కోసం చైనా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
మూడో గేమ్ మరింత రసవత్తరంగా సాగింది. చైనా జోడీ మరోసారి దూకుడుగా ఆడి 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 7-3తో నిలిచింది.
కానీ సాత్విక్-చిరాగ్ క్రమంగా పుంజుకుని స్కోరును 7-7తో సమం చేశారు. విరామ సమయానికి చైనా జోడీ రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది.
విరామం తర్వాత ఇరు జంటలు హోరాహోరీగా ర్యాలీలు ఆడటంతో మ్యాచ్ ఉత్కంఠకు చేరుకుంది.
వివరాలు
మ్యాచ్‌ను 2-1తో సొంతం చేసుకున్నారు
చైనా జోడీ 15-12తో ఆధిక్యంలోకి వెళ్లినా.. భారత జంట మరోసారి అద్భుతంగా పుంజుకుంది. చిరాగ్-సాత్విక్ 16-16తో స్కోరును సమం చేశారు.
చైనా జోడీ వెంటనే 17-16తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే అక్కడి నుంచి భారత స్టార్ జోడీ అద్భుతమైన ముగింపును ఇచ్చింది.
వరుసగా ఐదు పాయింట్లు సాధించి మూడో గేమ్‌ను 21-17తో గెలుచుకుంది.
దీంతో మ్యాచ్‌ను 2-1తో సొంతం చేసుకుని చైనా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్‌ను తొలిసారి తమ ఖాతాలో వేసుకుంది.