Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు.. ఒకే రోజు మూడు మెడల్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా క్రీడల్లో భారత షూటర్లు మరోసారి సత్తా చాటారు. రెండో రోజు షూటింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు దక్కాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాంశు థిల్లాన్ రజత పతకం సాధించగా.. రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పతకంతో మెరిశాడు. ఇదే విభాగం టీమ్ ఈవెంట్‌లో హిమాంశు, రుద్రాంక్ష్, పార్థ్ మానెతో కూడిన భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. మరోవైపు పోటీల తొలి రోజే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో పతకం ఖాయం చేసుకుని చరిత్ర సృష్టించిన సుచిక తరియాల్ అసాధారణంగా పోరాడినా స్వర్ణం, రజతం సాధించలేకపోయింది. ఆమెకు కాంస్య పతకం దక్కింది.
వివరాలు
షూటింగ్‌లో మూడు పతకాలు
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ 631.8, హిమాంశు థిల్లాన్ 630.0 పాయింట్లతో క్వాలిఫికేషన్‌లో సత్తా చాటారు.
వీరిద్దరూ వరుసగా మూడో, ఏడో స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరో భారత షూటర్ పార్థ్ మానె 628.3 పాయింట్లతో ముందంజ వేయలేకపోయాడు.
24 షాట్ల ఫైనల్లో రుద్రాంక్ష్ ఆరంభం నుంచి పసిడి రేసులో కొనసాగాడు. 14వ షాట్ ముగిసే సమయానికి 148.2 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
అదే సమయంలో హిమాంశు 146.7 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగాడు. అయితే ఆ తర్వాత రుద్రాంక్ష్ వెనుకబడగా.. హిమాంశు పుంజుకున్నాడు.
చివరి వరకు స్వర్ణం కోసం పోరాడిన హిమాంశు 252.4 పాయింట్లతో రజతం సాధించాడు.
వివరాలు
254.2 పాయింట్లతో స్వర్ణం
చైనా షూటర్ షెంగ్ లిహావో 254.2 పాయింట్లతో స్వర్ణం గెలిచాడు. రుద్రాంక్ష్ 230.9 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకున్నాడు.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలోనూ భారత షూటర్లు పతకం సాధించారు. హిమాంశు, రుద్రాంక్ష్, పార్థ్ మానెతో కూడిన భారత జట్టు 1890.1 పాయింట్లతో రజతం గెలిచింది.
చైనా 1899 పాయింట్లతో స్వర్ణం, కొరియా 1884.2 పాయింట్లతో కాంస్యం సాధించాయి.
ఆసియా క్రీడల తొలి రోజే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో వ్యక్తిగత విభాగంలో ఇలవేనిల్ వలరివన్, టీమ్ విభాగంలో ఇలవేనిల్, సోనమ్ మాస్కర్, విదర్సతో కూడిన భారత జట్లు రజత పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
వివరాలు
హాకీలో భారత అమ్మాయిల జోరు
హాకీలో భారత మహిళల జట్టు జోరు కొనసాగుతోంది. పూల్-బిలో తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌ను 19-0తో చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో ఇండోనేసియాపై 17-1తో ఘన విజయం సాధించింది. భారత్ తరఫున దీపిక 8వ, 28వ, 40వ నిమిషాల్లో గోల్స్ చేసి హ్యాట్రిక్ నమోదు చేసింది.
రుతుజ 15వ, 20వ, 38వ నిమిషాల్లో మూడు గోల్స్ చేయగా.. నవ్‌నీత్ కౌర్ 35వ, 56వ, 57వ నిమిషాల్లో గోల్స్ చేసి హ్యాట్రిక్ సాధించింది.
సునెలిటా టొప్పొ 11వ, 30వ నిమిషాల్లో, లాల్రెమ్‌సియామి 12వ, 16వ నిమిషాల్లో, సాక్షి రాణా 25వ, 57వ నిమిషాల్లో రెండేసి గోల్స్ చేశారు. కెప్టెన్ సలీమా 35వ నిమిషంలో, ఇషిక చౌదరి 36వ నిమిషంలో ఒక్కో గోల్ చేశారు.
వివరాలు
టీటీలో పాక్‌పై భారత్ క్లీన్‌స్వీప్
ఇండోనేసియా తరఫున ఏకైక గోల్‌ను 32వ నిమిషంలో ఇన్నెస్ సాధించింది. భారత్ తదుపరి బుధవారం థాయ్‌లాండ్‌తో తలపడనుంది.
టేబుల్ టెన్నిస్‌లో భారత పురుషుల, మహిళల జట్లు పాకిస్థాన్‌పై 3-0 విజయాలు సాధించాయి. మహిళల జట్టు తరఫున తొలి మ్యాచ్‌లో సుతీర్థ ముఖర్జీ 11-3, 11-3, 11-4తో అలీనా ఖాన్‌పై విజయం సాధించింది.
ఆ తర్వాత సిండ్రిలా దాస్ 11-6, 11-7, 11-5తో ఖల్సుమ్ ఖాన్‌ను ఓడించింది. మూడో మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 11-4, 11-4, 11-5తో ఫాతిమా ఖాన్‌పై గెలిచింది.
పురుషుల విభాగంలోనూ భారత్ 3-0తో పాకిస్థాన్‌ను ఓడించింది. హర్మీత్ దేశాయ్ 11-4, 11-3, 11-5తో మహ్మద్ ఖాన్‌పై విజయం సాధించాడు. సత్యన్ 11-1, 11-8, 11-9తో అబ్బాస్ ఖాన్‌ను చిత్తు చేశాడు.
వివరాలు
కబడ్డీలో డిఫెండింగ్ ఛాంపియన్లకు శుభారంభం
చివరి మ్యాచ్‌లో పయాస్ జైన్ 11-2, 11-5, 11-7తో మహ్మద్ ఖాన్‌పై గెలిచాడు.
కబడ్డీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ శుభారంభం చేసింది. గ్రూప్-ఎ తొలి మ్యాచ్‌లో జపాన్‌ను 49-24తో చిత్తు చేసింది.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత జట్టు.. అయాన్, దేవాంక్ రాణించడంతో ప్రథమార్ధం ముగిసే సమయానికి 31-9తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
రెండో అర్ధభాగంలోనూ అదే జోరు కొనసాగించిన భారత్ ఘన విజయం సాధించింది. మహిళల కబడ్డీలోనూ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ బోణీ కొట్టింది.
తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 42-21తో ఓడించింది. విరామ సమయానికి భారత్ 21-10తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం కూడా అదే దూకుడు కొనసాగించి విజయాన్ని సొంతం చేసుకుంది.
వివరాలు
బాక్సింగ్‌లో ప్రిక్వార్టర్స్‌కు సుమిత్
బాక్సింగ్‌లో భారత యువ బాక్సర్ సుమిత్ కుందు శుభారంభం చేశాడు. 70 కేజీల విభాగంలో అతడు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సిన్‌సిరిపై సుమిత్ 5-0తో ఘన విజయం సాధించాడు.
బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్‌ను3-0తో చిత్తు చేసింది. లక్ష్యసేన్ 21-4, 21-12తో అయేమన్ జమాన్‌ను ఓడించాడు.
అనంతరం ఆయుష్ శెట్టి 21-4, 21-13తో గౌరవ్ సింగ్‌పై విజయం సాధించాడు. చివరి మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-15, 21-9తో జుమర్ అల్ అమీన్‌ను ఓడించాడు. దీంతో భారత్ 3-0తో విజయాన్ని నమోదు చేసి క్వార్టర్‌ఫైనల్ చేరింది.
గురువారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో భారత్, జపాన్‌తో తలపడనుంది. మహిళల భారత బ్యాడ్మింటన్ జట్టు కూడా క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌తోనే తలపడనుంది.