Loading...
Asian Games: కబడ్డీలో కదం తొక్కిన భారత అమ్మాయిలు.. ఇరాన్‌పై గెలిచి పసిడి సొంతం!
కబడ్డీలో కదం తొక్కిన భారత అమ్మాయిలు.. ఇరాన్‌పై గెలిచి పసిడి సొంతం!

Asian Games: కబడ్డీలో కదం తొక్కిన భారత అమ్మాయిలు.. ఇరాన్‌పై గెలిచి పసిడి సొంతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 26, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పట్టికలో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. భారత ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. కబడ్డీ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు.. ఫైనల్‌లో ఇరాన్‌ను ఓడించి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ పోరులో భారత అమ్మాయిలు 37-33 తేడాతో ఇరాన్‌పై విజయం సాధించారు. దీంతో కబడ్డీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకోవడంతో పాటు.. భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు. మరోవైపు రైఫిల్ షూటింగ్‌లో భారత బృందం రజత పతకాన్ని దక్కించుకుంది. స్క్వాష్‌లో భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ సెమీఫైనల్లో ఓటమి పాలై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

వివరాలు

50 మీటర్ల రైఫిల్‌లో రజతం

50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో తిలోత్తమా సేన్, విదర్సా వినోద్, ఆషి చౌక్షే రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ పోటీల్లో చైనా బృందం 1773 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. భారత బృందం 1763 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

1754 పాయింట్లు సాధించిన కజకిస్థాన్ జట్టుకు కాంస్య పతకం లభించింది.

వివరాలు

స్క్వాష్‌లో కాంస్యం

స్క్వాష్ విభాగంలో మిక్స్‌డ్ డబుల్స్ జోడీ జోష్న చిన్నప్ప-సెంథిల్ కుమార్‌కు కాంస్య పతకం దక్కింది. సెమీఫైనల్లో హాంకాంగ్‌కు చెందిన లీ కా యి, తాంగ్ మింగ్ హాంగ్ జోడీ చేతిలో భారత జంట ఓటమి పాలైంది. దీంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మారథాన్‌లో సావన్ బర్వాల్ చరిత్ర

అంతకుముందు భారత అథ్లెట్, హవల్దార్ సావన్ బర్వాల్ (Sawan Barwal) మారథాన్‌లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ పోటీల్లో రజత పతకంతో మెరిసిన సావన్.. 44 ఏళ్ల తర్వాత మారథాన్‌లో భారత్‌కు పతకాన్ని అందించాడు.

ADVERTISEMENT