Hockey : ఐదో స్థానం కోసం...నేడు జర్మనీతో భారత మహిళల హాకీ జట్టు పోరు
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు దూరమైన భారత జట్టు.. టోర్నీలో చివరిసారిగా బరిలోకి దిగనుంది. గురువారం అయిదో స్థానం కోసం జరిగే ప్లేఆఫ్ మ్యాచ్‌లో జర్మనీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రపంచకప్‌ను ఘనంగా ముగించాలని సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. 1974 తర్వాత ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 1974లో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. ఈ టోర్నీకి ముందు జర్మనీతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు పరాజయం పాలైంది. అయితే ఈసారి మాత్రం ఆ జట్టును ఓడించి విజయంతో టోర్నీని ముగించాలని భారత్ భావిస్తోంది.
వివరాలు
భారత్ లక్ష్యం అదే..
ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత అమ్మాయిలు ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయారు.
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే పరాజయం ఎదురైంది. ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా.. మరో మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించారు.
అయితే ఇతర సమీకరణాలు అనుకూలించకపోవడంతో సెమీఫైనల్‌కు అడుగు దూరంలోనే నిలిచిపోయారు.
ఈ టోర్నీలో భారత జట్టుకు ప్రధాన సానుకూలాంశం రక్షణశ్రేణి. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ డిఫెన్స్ విభాగం అద్భుతంగా రాణించింది.
సీనియర్ గోల్‌కీపర్ సవితతో పాటు బిచు దేవి నెట్ వద్ద కీలక సమయంలో ఎన్నో గోల్స్‌ను అడ్డుకున్నారు.
మరోవైపు.. ఈ ప్రపంచకప్ ద్వారా 11 మంది భారత క్రీడాకారిణులు తొలిసారి ప్రపంచకప్ అనుభవాన్ని సొంతం చేసుకున్నారు.