Page Loader
Jasprit Bumrah: తిరిగివస్తున్న పేసు గుర్రం .. ముంబయి ఆటతీరు మెరుగుపడుతుందా..?
తిరిగివస్తున్న పేసు గుర్రం .. ముంబయి ఆటతీరు మెరుగుపడుతుందా..?

Jasprit Bumrah: తిరిగివస్తున్న పేసు గుర్రం .. ముంబయి ఆటతీరు మెరుగుపడుతుందా..?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబయి ఇండియన్స్‌ బౌలింగ్‌ విభాగానికి ప్రధాన అస్త్రం జస్‌ప్రీత్‌ బుమ్రా. అతని చురకత్తుల్లాంటి బంతులతో ఏ బ్యాట్స్‌మెన్‌నైనా బెంబేలు పెట్టించే సత్తా అతడి సొంతం. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనడం సులువు కాదు. అయితే ఇలాంటి కీలక బౌలర్‌ను లేకుండా ముంబయి ఇండియన్స్‌ ఈ సీజన్‌ (ఐపీఎల్‌ 2025) ఆరంభించాల్సి వచ్చింది. గాయం నుంచి పూర్తిగా కోలుకొని మళ్లీ జట్టులోకి అడుగుపెడుతున్న బుమ్రా రాకతో ముంబయి ఆటతీరు మెరుగవుతుందా? ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించగలుగుతుందా?

వివరాలు 

ముంబయి పేలవ ప్రదర్శన

గత సీజన్‌లాగే ఈ సారి కూడా ముంబయి పేలవ ప్రదర్శనతో టోర్నీని మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒకటిలో మాత్రమే విజయం సాధించి,పాయింట్ల పట్టికలో చివర నుండి మూడో స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నాడు.ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాడు. అతడి రాకతో ముంబయి బౌలింగ్‌ యూనిట్‌ మరింత బలంగా మారనున్నదనే విషయం స్పష్టమే. ఇప్పటివరకు ట్రెంట్‌ బౌల్ట్‌,దీపక్‌ చాహర్‌,హార్దిక్‌ పాండ్య ముంబయి పేస్‌ బలాన్ని మోస్తూ వచ్చారు. బుమ్రా రాకతో ఎవరికి అవకాశాన్ని తగ్గిస్తారో చూడాలి.ఇప్పటివరకు జట్టు తరఫున ఎక్కువ వికెట్లు(8) తీయడంలో హార్దిక్‌ ముందంజలో ఉన్నాడు. ఇందులో లక్నోపై తీసిన ఐదు వికెట్లు ఉన్నాయి.అయినప్పటికీ ఆ మ్యాచ్‌లో ముంబయి పరాజయాన్ని చవిచూసింది.

వివరాలు 

పవర్‌ప్లే పటిష్ఠం.. 

పవర్‌ప్లేలో ట్రెంట్‌ బౌల్ట్‌, దీపక్‌ చాహర్‌ మంచి ప్రభావాన్ని చూపుతుంటారు. ఇప్పటి వరకు పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో బౌల్ట్‌ (64), చాహర్‌ (63) రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నారు. వీరితో పాటు బుమ్రా కూడా ఉండటం వలన ముంబయికి మొదటి ఆరు ఓవర్లలో ప్రత్యర్థులపై ఒత్తిడి సృష్టించడం చాలా సులభం అవుతుంది. ఇక డెత్‌ ఓవర్లలోనూ బుమ్రా బలమైన అస్త్రంగా నిలుస్తాడు. అతని యార్కర్‌లు చెక్కుచెదరని విధంగా ప్రత్యర్థులపై విజృంభిస్తాయి.

వివరాలు 

ఆర్సీబీపై మంచి రికార్డే.. 

ఇప్పుడు బెంగళూరుతో మ్యాచ్‌ ఉండటంతో బుమ్రా తన పాత రికార్డును కొనసాగించే అవకాశం ఉంది. గత సంవత్సరం వాంఖడే స్టేడియంలో ఆర్సీబీపై బుమ్రా 5/21తో మెరుపు ప్రదర్శన ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఆర్సీబీతో జరిగిన 19మ్యాచ్‌ల్లో బుమ్రా 7.45ఎకానమీ రేటుతో 29వికెట్లు తీశాడు.ఈసారి కూడా అదే స్థాయిలో రాణిస్తే ఆర్సీబీని తక్కువ స్కోరుకే కట్టడి చేసే అవకాశముంది. దీనితో పాటు ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌,విరాట్‌ కోహ్లీ బుమ్రాకు వ్యతిరేకంగా ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, బుమ్రా బౌలింగ్‌కు తాము సిద్ధమై ఉన్నామని,గట్టిగా పోటీ ఇస్తామని ఆర్సీబీ ఆటగాడు టిమ్‌ డేవిడ్ వెల్లడించాడు. గత సీజన్‌ వరకు డేవిడ్ కూడా ముంబయికే ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

వివరాలు 

బుమ్రా పునరాగమనం 

బుమ్రా 2013 నుంచి ముంబయి తరఫున ఆడుతున్నాడు.ఇప్పటివరకు 133 మ్యాచ్‌ల్లో 165 వికెట్లు తీసాడు. 2023లో వెన్ను గాయం కారణంగా ఐపీఎల్‌కి దూరమయ్యాడు. ఈ సారి సీజన్‌ ఆరంభానికి ముందు కూడా కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోయాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీ నుంచి అతడికి పూర్తిగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన అనంతరం ముంబయి ఇండియన్స్‌ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. వెన్ను సమస్యల వల్ల జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ తర్వాత బుమ్రా మళ్లీ మైదానంలో కనిపించలేదు. అనంతరంగా ఇంగ్లాండ్‌ సిరీస్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం మళ్లీ ఐపీఎల్‌లో పునరాగమనానికి సిద్ధమయ్యాడు.