LOADING...
IPL 2026: డేంజర్‌ జోన్‌లో ఆ ఐదుగురు కెప్టెన్ల భవిష్యత్తు..
డేంజర్‌ జోన్‌లో ఆ ఐదుగురు కెప్టెన్ల భవిష్యత్తు..

IPL 2026: డేంజర్‌ జోన్‌లో ఆ ఐదుగురు కెప్టెన్ల భవిష్యత్తు..

వ్రాసిన వారు Moogati Shabari
May 30, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్‌ రేసులో నిలవలేకపోయిన కొన్ని జట్లలో నాయకత్వంపై చర్చలు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వరుస సీజన్లలో జట్లు ఆశించిన ఫలితాలు సాధించకపోవడం, ప్రదర్శనలో నిలకడ లేకపోవడం, కెప్టెన్ల వ్యక్తిగత ఆట కూడా ప్రభావం చూపకపోవడంతో ఆయా జట్లు నాయకత్వ మార్పులపై ఆలోచిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

వివరాలు

రిషబ్ పంత్ - లక్నో సూపర్ జెయింట్స్

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరగా రూ.27 కోట్లకు రిషబ్ పంత్‌ను సొంతం చేసుకున్న లక్నో సూపర్జెయింట్స్ అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ జట్టు ప్రదర్శన ఆ అంచనాలకు తగ్గట్టుగా లేకపోయింది. 2025లో ఏడో స్థానంతో ముగిసిన లక్నో, 2026లో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పంత్ నాయకత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జట్టుకు కొత్త దిశ అవసరమని లక్నో గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. కెప్టెన్సీ అంశంపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని ఆయన చెప్పడంతో పంత్ భవిష్యత్తుపై అనిశ్చితి మరింత పెరిగింది.

వివరాలు

హార్దిక్ పాండ్యా - ముంబై ఇండియన్స్

రోహిత్ శర్మ తర్వాత ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నాయకత్వంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025లో జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చినా, 2026లో మాత్రం ముంబై అభిమానులను మరోసారి నిరాశపరిచింది. జట్టులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి అనుభవజ్ఞులైన నాయకత్వ సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఉండటంతో హార్దిక్ తన నాయకత్వాన్ని పూర్తిగా స్థిరపరచుకోలేకపోయాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024లో ముంబై చివరి స్థానంలో నిలవగా, 2026లో కూడా నెట్ రన్‌రేట్ కారణంగానే ఆ పరిస్థితిని తప్పించుకుంది.

Advertisement

వివరాలు

రుతురాజ్ గైక్వాడ్ - చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం తన చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ జట్టును వరుసగా మూడు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. బ్యాటర్‌గా కూడా అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 2026 సీజన్‌లో గైక్వాడ్ కేవలం 337 పరుగులకే పరిమితమయ్యాడు. అంతేకాకుండా పవర్‌ప్లే ఓవర్లలో అత్యల్ప స్ట్రైక్‌రేట్ నమోదు చేయడం అతని ప్రదర్శనపై మరింత విమర్శలకు దారితీసింది. జట్టులో సంజు శాంసన్ వంటి అనుభవజ్ఞుడు ఉండటంతో కెప్టెన్సీ మార్పుపై చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది.

Advertisement

వివరాలు

అజింక్య రహానే - కోల్‌కతా నైట్ రైడర్స్

టెస్టు క్రికెట్‌లో సమర్థ నాయకుడిగా గుర్తింపు పొందిన అజింక్య రహానే, ఐపీఎల్‌లో మాత్రం అదే ప్రభావాన్ని కొనసాగించలేకపోయాడు. 2024లో టైటిల్ సాధించిన కేకేఆర్, అనంతరం వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. 2026లో రహానే బ్యాటింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అతనిపై ఒత్తిడి మరింత పెరిగింది. త్వరలోనే 38 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టనున్న రహానే స్థానంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త నాయకుడిని ఎంపిక చేయాలా అనే అంశంపై కేకేఆర్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

వివరాలు

అక్షర్ పటేల్ - ఢిల్లీ క్యాపిటల్స్

అక్షర్ పటేల్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు సీజన్లలో మంచి ఆరంభం చేసినప్పటికీ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. 2025లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఢిల్లీ, చివరికి అవకాశాన్ని కోల్పోయింది. 2026లో కూడా జట్టు అస్థిర ప్రదర్శనతో నిరాశపరిచింది. తరచూ బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేయడం, భారతీయ బౌలర్ల నుంచి ఆశించిన స్థాయి ప్రదర్శన రాకపోవడం జట్టుకు ప్రతికూలంగా మారాయి. వచ్చే సీజన్‌కు ముందు ఫ్రాంచైజీ యాజమాన్య స్థాయిలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కెప్టెన్సీపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Advertisement