IPL 2026 Points Table: 24 గంటలే రాజస్థాన్ టాప్ ప్లేస్..అగ్రస్థానంలోకి మళ్లీ ఆర్సీబీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 19వ సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మైదానంలో బ్యాట్స్‌మెన్‌లు బౌండరీలు, సిక్సర్లతో ప్రేక్షకులను అలరిస్తుండగా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడానికి జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆదివారం నిర్వహించిన డబుల్ హెడ్డర్ మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గత సీజన్ విజేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి అద్భుత ప్రదర్శనతో మొదటి స్థానాన్ని తిరిగి సాధించింది. ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 43 పరుగుల తేడాతో విజయం సాధించిన బెంగళూరు జట్టు, మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
వివరాలు
టేబుల్ టాపర్‌గా జట్టు..
రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒక రోజు ముందు టాప్ స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ, ఆర్సీబీ మళ్లీ దానిని స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ గెలిచి 4 పాయింట్లు సాధించింది. నెట్ రన్‌రేట్ (+2.507) మెరుగ్గా ఉండటం వల్ల రాజస్థాన్ (+2.233) కంటే ముందంజలో నిలిచింది. వరుస విజయాలతో రజత్ పాటిదార్ నాయకత్వంలోని జట్టు ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉంది. ఇక ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ పోరులో లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్‌లో తన మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది.
వివరాలు
గెలుగు ఖాతా తెరవని జట్లు ఇవే..
రెండు మ్యాచ్‌లు ఆడిన లక్నోకు ఇదే తొలి గెలుపు. మరోవైపు హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్‌ల్లో రెండో పరాజయాన్ని చవిచూసింది. పాయింట్ల పట్టికలో ఎస్ఆర్‌హెచ్ (+0.275) ఐదవ స్థానంలో ఉండగా, లక్నో జట్టు ఎనిమిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. నెట్ రన్‌రేట్ బాగున్నప్పటికీ వరుస ఓటములు హైదరాబాద్ జట్టుకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సీజన్‌లో చెన్నై ప్రదర్శన అత్యంత నిరాశ కలిగిస్తోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించని జట్లలో చెన్నై ఒకటి. గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు కానీ అవి రెండేసి మ్యాచ్‌లే ఆడాయి.
వివరాలు
చెన్నైకి వరుస పరాజయాలు..
చెన్నై మాత్రం మూడు మ్యాచ్‌లు ఆడి మూడు పరాజయాలు ఎదుర్కోవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలపై ఇప్పటికే సందేహాలు మొదలయ్యాయి. నెట్ రన్‌రేట్ పరంగా కూడా చెన్నై మిగతా జట్ల కంటే వెనుకబడి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ ఆరో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో పోటీ తీవ్రత ఎంత ఉందంటే, ఒకే మ్యాచ్ ఫలితం జట్ల స్థానాలను గణనీయంగా మార్చేస్తోంది. ఒక్క గెలుపు లేదా ఓటమితో జట్లు ఐదారు స్థానాలు పైకి లేదా కిందకి మారుతున్నాయి. రాబోయే మ్యాచ్‌లలో గుజరాత్, కోల్‌కతా జట్లు గెలిస్తే పాయింట్ల పట్టికలో మరిన్ని ఆసక్తికర మార్పులు కనిపించే అవకాశముంది.