Sunrisers Hyderabad IPL 2026 analysis: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారైనా టైటిల్ గెలుస్తుందా? బలాలు, బలహీనతలివే
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో దక్కన్ చార్జర్స్ జట్టుకు ప్రత్యామ్నాయంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏర్పడింది. 2012 అక్టోబర్ 25న ఈ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రారంభమైంది. సన్ నెట్‌వర్క్ సంస్థ, కళానిధి మారన్ ఆధ్వర్యంలో ఈ జట్టును కొనుగోలు చేసింది. 2016 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ జట్టుకు హోమ్ గ్రౌండ్. ప్రస్తుతం ఈ జట్టుకు డేనియల్ వెటోరి కోచ్‌గా సేవలు అందిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 2013లో తన తొలి ఐపీఎల్ సీజన్ ఆడింది. ఆ మొదటి ఏడాదిలోనే ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. 2016లో అద్భుత ప్రదర్శనతో బెంగళూరును ఓడించి టైటిల్ గెలుచుకుంది.
వివరాలు
రికార్డుల పరంపర
2016 నుంచి 2020 వరకు వరుసగా ఐదు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరడం ఈ జట్టు స్థిరత్వాన్ని చూపించింది. 2018లో ఫైనల్‌కు చేరినా చెన్నై చేతిలో ఓటమి పాలైంది. బలమైన బౌలింగ్ ప్లేయర్లతో ఈ జట్టు పేరు తెచ్చుకుంది. 2024లో 287 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ నమోదు చేసింది. డేవిడ్ వార్నర్ 2015, 2017, 2019 సీజన్లలో మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ 2016, 2017లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ సాధించాడు. కోవిడ్ ప్రభావంతో సన్‌రైజర్స్ బ్రాండ్ విలువ గణనీయంగా తగ్గింది. 2020లో జట్టు విలువ 57.4 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇది సుమారు నాలుగు శాతం తగ్గుదలగా నమోదైంది.
వివరాలు
జట్టు బలాలు..
ఈసారి కూడా బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ ప్రధాన బలంగా నిలవనున్నారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. హెడ్ ఇటీవల పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా, ఐపీఎల్ సమయానికి ఫామ్‌లోకి వస్తాడని నమ్మకం ఉంది. ఇక అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇటీవల టి20 వరల్డ్ కప్‌లో మంచి ప్రదర్శనతో తిరిగి ఫామ్ అందుకున్నారు. టీమిండియా విజయానికి తమ వంతు సహకారం అందించారు. వీరి ఫామ్ జట్టుకు ఉత్సాహాన్ని ఇస్తోంది.
వివరాలు
బలహీనతలు ఇవే..
పాట్ కమిన్స్ ఆడకపోతే బౌలింగ్ విభాగంపై ప్రభావం పడే అవకాశం ఉంది. గత సీజన్‌లో బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కమిన్స్ లేకపోతే ఆ లోటును ఎవరు భర్తీ చేస్తారన్న సందేహం ఉంది. ఐపీఎల్‌లో పరుగులు అధికంగా వస్తాయి కాబట్టి, ఫ్లాట్ పిచ్‌లపై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయకపోతే పరిస్థితి కష్టమవుతుంది. అందుకే ఈసారి హైదరాబాద్ బౌలర్లు మరింత క్రమశిక్షణతో ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.