LOADING...
IPL 2026: ఆర్సీబీ - ముంబయి మ్యాచ్‌పై వర్షం ప్రభావం.. రద్దైతే ఎవరికి నష్టం?
ఆర్సీబీ - ముంబయి మ్యాచ్‌పై వర్షం ప్రభావం.. రద్దైతే ఎవరికి నష్టం?

IPL 2026: ఆర్సీబీ - ముంబయి మ్యాచ్‌పై వర్షం ప్రభావం.. రద్దైతే ఎవరికి నష్టం?

వ్రాసిన వారు Moogati Shabari
May 10, 2026
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం రాయ్‌పుర్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములు ఎదుర్కొన్న ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థితిని మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. మరోవైపు, ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సాంకేతికంగా మాత్రమే ఉన్న ముంబయి ఇండియన్స్‌కు ఈ పోరు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైతే ఆ జట్టు అధికారికంగా టోర్నీ నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

వివరాలు

మ్యాచ్‌కు వర్షం ముప్పు..

అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటం ముంబయి శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. శనివారం సాయంత్రం రాయ్‌పుర్‌లో భారీ వర్షం కురవడంతో రెండు జట్ల సాధన కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం వాతావరణం కొంత మెరుగుపడినా, సాయంత్రం సమయంలో మళ్లీ జల్లులు పడే అవకాశముందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున లభిస్తుంది. అలాంటి పరిస్థితిలో ముంబయి ఇండియన్స్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా మొత్తం 13 పాయింట్లకే పరిమితం అవుతుంది. ఐపీఎల్‌లో 10 జట్లు పాల్గొంటున్న ప్రస్తుత ఫార్మాట్‌లో 13 పాయింట్లతో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఉదాహరణ లేదు.

వివరాలు

రసవత్తర పోరు..

ఇప్పటివరకు ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్ జట్లు మొత్తం 35 మ్యాచ్‌ల్లో తలపడగా, ముంబయి 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. బెంగళూరు 16 సార్లు గెలిచింది. ఈ సీజన్‌లో వాంఖడే స్టేడియంలో జరిగిన పోరులో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబయిపై ఆర్సీబీ విజయం సాధించడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ సీజన్‌ను ప్రారంభించిన ఆర్సీబీ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి, అందులో ఆరు విజయాలతో 12 పాయింట్లు సంపాదించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Advertisement