LOADING...
IPL Birthday: ఇవాళ మెగా లీగ్‌ బర్త్‌డే.. ఐపీఎల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఇవాళ మెగా లీగ్‌ బర్త్‌డే.. ఐపీఎల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

IPL Birthday: ఇవాళ మెగా లీగ్‌ బర్త్‌డే.. ఐపీఎల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 18, 2026
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

2008 ఏప్రిల్ 18న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అభివృద్ధి చెందుతూ, ఇప్పుడు 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం 19వ సీజన్ జరుగుతోంది. ఈ ప్రయాణంలో ఆర్థికంగా, ఆటగాళ్ల సంపాదనలో, అలాగే ప్రేక్షకాదరణలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట ఎనిమిది జట్లతో ప్రారంభమైన ఐపీఎల్‌కు 2008లో సుమారు 723 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ ఉండేది. అది భారత కరెన్సీలో దాదాపు రూ. 3,100 కోట్లకు సమానం. అప్పట్లో ఒక డాలర్ విలువ సుమారు రూ. 45 ఉండేది.

వివరాలు

పెరిగిన బ్రాండ్ విలువ..

ప్రస్తుతం 10 జట్లతో కొనసాగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ బ్రాండ్ విలువ రూ. 1.50 లక్షల కోట్లకు (దాదాపు 18.5 బిలియన్ డాలర్లు) పెరిగింది. ఇప్పుడు ఒక డాలర్ విలువ సుమారు రూ. 90కి చేరింది. ఇటీవలి కాలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఒక్కొక్కటి సుమారు రూ. 16,000 కోట్ల విలువకు అమ్ముడవడం విశేషం. ఐపీఎల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. గత ఏడాది ఫైనల్ మ్యాచ్‌కు 31.7 బిలియన్ నిమిషాల వాచ్ టైమ్ నమోదై రికార్డు సృష్టించింది.

వివరాలు

అదే తేదీన అదే జట్టు..

ఇప్పటివరకు జరిగిన 18 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ చెరో ఐదు సార్లు టైటిల్ గెలిచాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ అలాగే ఆర్సీబీ, గుజరాత్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి. 2008 ఏప్రిల్ 18న జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటీపడింది. ఆసక్తికరంగా అదే తేదీన ఆర్సీబీ మళ్లీ మ్యాచ్ ఆడుతోంది. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో తలపడనుంది.

Advertisement

వివరాలు

అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆడుతున్నవారు వీరే..

మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆటగాళ్లు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందులో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మనీష్ పాండే ఇంకా ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. ఐపీఎల్ 2026లో ప్రత్యేకంగా అన్ని పది జట్ల కెప్టెన్లు భారత జట్టుకు చెందినవారే కావడం విశేషం. ఐపీఎల్ ప్రారంభంలో జరిగిన మొదటి రెండు సీజన్లలో టైటిళ్లు గెలిచిన జట్ల కెప్టెన్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లే. 2008లో షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్‌ను విజేతగా నిలిపితే, 2009లో ఆడమ్ గిల్‌క్రిష్ట్ డెక్కన్ ఛార్జర్స్‌ను గెలిపించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిపించిన కెప్టెన్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ. అలాగే రోహిత్ శర్మ ఆటగాడిగా మొత్తం ఆరు టైటిళ్లు గెలుచుకోవడం ప్రత్యేకత.

Advertisement