LOADING...
Iran Football Team: అమెరికా లాకర్‌ రూమ్‌లో ఇరాన్ జట్టు భావోద్వేగ నోట్‌.. శాంతి కోసం ప్రపంచానికి సందేశం!
అమెరికా లాకర్‌ రూమ్‌లో ఇరాన్ జట్టు భావోద్వేగ నోట్‌.. శాంతి కోసం ప్రపంచానికి సందేశం!

Iran Football Team: అమెరికా లాకర్‌ రూమ్‌లో ఇరాన్ జట్టు భావోద్వేగ నోట్‌.. శాంతి కోసం ప్రపంచానికి సందేశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2026
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగా, మరోవైపు ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్ ఫుట్‌ బాల్ జట్టు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న టోర్నీలో ఇరాన్ జట్టు న్యూజిలాండ్, బెల్జియం జట్లతో ఆడిన మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. ఇప్పటివరకు ఓటమి చవిచూడని ఆ జట్టు నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుని తదుపరి మ్యాచ్‌లో ఈజిప్ట్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, లాస్ ఏంజెలెస్‌లో బెల్జియంతో జరిగిన మ్యాచ్ అనంతరం ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు తమ లాకర్ రూమ్‌లో వదిలివెళ్లిన ఓ భావోద్వేగ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖలోని విషయాలను ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తాజాగా ప్రజలతో పంచుకుంది.

వివరాలు

ఇరాన్ జట్టుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

టోర్నీలో తమకు లభించిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎదుర్కొన్న సవాళ్లను కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. ''వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన పర్షియా నుంచి ఇప్పటివరకు ఇరాన్ స్ఫూర్తి సజీవంగా, స్థిరంగా నిలిచింది. మేము ఎంతో గర్వంగా లాస్ ఏంజెలెస్‌కు వచ్చాం. సగౌరవంగా పోటీపడ్డాం. అదే హుందాతనంతో ఈ నగరాన్ని వీడుతున్నాం. ఇరాన్ జట్టుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రపంచ దేశాల మధ్య శాంతి, స్నేహం, పరస్పర గౌరవం మరింత వర్ధిల్లాలని కోరుకుంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా, లేఖ చివరలో #168 మరియు #Minab అనే పదాలను జోడించారు. ఈ రెండు పదాల వెనుక విషాదకరమైన నేపథ్యం ఉంది.

వివరాలు

48 గంటలకు మించి దేశంలో ఉండకూడదు

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన సమయంలో మినాబ్ ప్రాంతంలోని ఓ పాఠశాలపై అమెరికాకు చెందిన తోమహాక్ క్షిపణి పడినట్లు సమాచారం. ఈ ఘటనలో 160 మందికి పైగా చిన్నారులు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంటున్నారు. ఆ విషాద ఘటనను గుర్తుచేస్తూ ఆటగాళ్లు తమ లేఖలో 'మినాబ్' మరియు '168' అనే పదాలను ప్రస్తావించారు. మరోవైపు టోర్నీలో పాల్గొంటున్న ఇరాన్ జట్టు వసతి ఏర్పాట్లు కూడా ప్రత్యేక చర్చకు దారితీశాయి. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఒకేసారి 48 గంటలకు మించి దేశంలో ఉండేందుకు ఇరాన్ జట్టుకు అనుమతి ఇవ్వలేదని సమాచారం.

Advertisement

వివరాలు

వీసా తిరస్కరణ వంటి సమస్యలు

దీంతో ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ప్రతి మ్యాచ్ కోసం మెక్సికోలోని టిజువానా నగరం నుంచి సరిహద్దు దాటి అమెరికాకు వచ్చి తిరిగి వెళ్తోంది. అదే సమయంలో జట్టుతో పాటు ప్రయాణించే కొందరు ప్రతినిధులు వీసా తిరస్కరణ వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అనేక ఇబ్బందులు, పరిమితుల మధ్య కూడా ఇరాన్ జట్టు ఫిఫా ప్రపంచకప్‌లో పోటీ పడుతూ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

Advertisement