Virat Kohli: 'నా బూట్లు అమ్ముడుపోకపోయినా పర్లేదు'.. టెస్ట్ రీ-ఎంట్రీపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి మళ్లీ రానున్నాడంటూ కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు స్వయంగా తెరదించాడు. తాను టెస్ట్ ఫార్మాట్ నుంచి పూర్తిగా వైదొలిగానని, మళ్లీ వైట్ జెర్సీ ధరించే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. ఆదివారం ఢిల్లీలోని ద్వారకలో నిర్వహించిన తన స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ 'One8' కొత్త షూస్ కలెక్షన్ లాంచ్ కార్యక్రమంలో కోహ్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హోస్ట్, కమెడియన్ డానిష్ సైత్ అడిగిన సరదా ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాలు
బూట్ల ధర.. కోహ్లీ టెస్ట్ పరుగులు!
ఈకార్యక్రమంలో ఆవిష్కరించిన ప్రత్యేక రెడ్ కలర్ షూస్ ధరను రూ.9,230గా నిర్ణయించారు.ఇదే సంఖ్య కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌లో సాధించిన మొత్తం పరుగుల సంఖ్య కావడం విశేషం. దీనిని ప్రస్తావించిన డానిష్ సైత్.. "మీ బ్రాండ్ షూస్ అమ్మకాలు, లాభాలు మరింత పెరగాలంటే మీరు మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడి ఇంకొన్ని పరుగులు చేయొచ్చు కదా అంటూ సరదాగా ప్రశ్నించాడు. దానికి చిరునవ్వుతో స్పందించిన కోహ్లీ.. నా బూట్లు తక్కువ ధరకే అమ్ముడైనా ఫర్వాలేదు. కానీ నేను ఆ ఫేజ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాను. థాంక్యూ అని స్పష్టంగా చెప్పాడు. కోహ్లీ వ్యాఖ్యలతో గత కొద్ది వారాలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న టెస్ట్ రీ-ఎంట్రీ వార్తలకు పూర్తిగా చెక్ పడింది.
వివరాలు
14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు గుడ్‌బై
విరాట్ కోహ్లీ 2025 మే నెలలో తన 14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. మొత్తం 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు. అలాగే కెప్టెన్‌గా 68 టెస్టుల్లో జట్టును నడిపించి 40 విజయాలు అందించి భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.
వివరాలు
2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా ప్రణాళిక
ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న కోహ్లీ తన దృష్టిని పూర్తిగా వైట్‌బాల్ క్రికెట్‌పై కేంద్రీకరించాడు. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకుని తన ప్రణాళికలను రూపొందిస్తున్నాడు. ఇటీవల హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన కోహ్లీ, ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. జూలైలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజా వ్యాఖ్యలతో టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వస్తాడనే ప్రచారానికి స్వయంగా ముగింపు పలికిన కోహ్లీ, ఇకపై తన కెరీర్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌కే అంకితం చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశాడు.