LOADING...
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో కరచాలనం చేసిన జై షా.. మండిపడుతున్న ఫ్యాన్స్
పాకిస్థాన్ కెప్టెన్‌తో కరచాలనం చేసిన జై షా.. మండిపడుతున్న ఫ్యాన్స్

Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో కరచాలనం చేసిన జై షా.. మండిపడుతున్న ఫ్యాన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2026
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు నిర్వహించిన 'కెప్టెన్స్ కార్నివల్' కార్యక్రమంలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఇంగ్లాండ్‌లో జూన్ 7న జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జై షా, పాకిస్థాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు టోర్నీలో పాల్గొననున్న 12 జట్ల కెప్టెన్లు హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా జై షా అన్ని జట్ల కెప్టెన్లను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఫాతిమా సనాతో ఆయన హ్యాండ్‌షేక్ చేసిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ కావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాలు

జట్లను సమానంగా గౌరవించడం ఆయన బాధ్యత

ఈ ఘటనపై భారత్, పాకిస్థాన్ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పాకిస్థాన్ అభిమానులు గతంలో భారత క్రికెట్ జట్టు అనుసరించిన 'నో హ్యాండ్‌షేక్' విధానాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. మరోవైపు భారత అభిమానులు మాత్రం జై షా ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ హోదాలో ఉన్నందున అన్ని జట్లను సమానంగా గౌరవించడం ఆయన బాధ్యత అని అభిప్రాయపడ్డారు. గతంలో భారత్-పాకిస్థాన్ సంబంధాల నేపథ్యంలో ఇరు దేశాల క్రికెట్ జట్ల మధ్య హ్యాండ్‌షేక్ అంశం పలుమార్లు వివాదాస్పదమైంది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత జట్టు పాకిస్థాన్ ఆటగాళ్లతో అధికారిక కార్యక్రమాల్లో దూరంగా ఉండటం వార్తల్లో నిలిచింది. ఆ నేపథ్యంతో జై షా చేసిన ఈ కరచాలనం మరోసారి చర్చకు కారణమైంది.

వివరాలు

గత ఎడిషన్ విజేత న్యూజిలాండ్

ఇదిలా ఉంటే, 2026 ఐసిసి మహిళల టీ20 ప్రపంచ కప్ జూన్ 12న ఇంగ్లాండ్-శ్రీలంక మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. టోర్నీలో అత్యంత ఆసక్తికర పోరుగా భావిస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. కాగా, గత ఎడిషన్ విజేతలైన న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

Advertisement