Loading...
ENG vs IND: జో రూట్ కీలక ఇన్నింగ్స్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి
జో రూట్ కీలక ఇన్నింగ్స్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి

ENG vs IND: జో రూట్ కీలక ఇన్నింగ్స్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

జో రూట్‌ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ ఇంగ్లండ్‌కు కీలక విజయాన్ని అందించింది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌ వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత్‌పై ఆతిథ్య జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. 234 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 44.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. ఈ ఫలితంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ 1-1తో సమమైంది. దీంతో సిరీస్‌ విజేతను నిర్ణయించే మూడో, చివరి వన్డే జులై 19న లార్డ్స్‌ వేదికగా జరగనుంది. 234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు, 125 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

వివరాలు

99 పరుగులతో రాణించిన జో రూట్

అయితే ఆ క్లిష్ట సమయంలో జో రూట్‌, విల్‌ జాక్స్‌ బాధ్యతాయుతంగా ఆడి ఆరో వికెట్‌కు 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అనంతరం గస్‌ అట్కిన్సన్‌తో కలిసి రూట్‌ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ముగించాడు.

రూట్‌ 133 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలవగా, అట్కిన్సన్‌ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయ తీరానికి చేర్చాడు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది.

ఒక దశలో 178/3తో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించిన టీమిండియా, చివరి ఏడు వికెట్లను కేవలం 55 పరుగుల వ్యవధిలో కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది.

వివరాలు

జులై 19న లార్డ్స్ లో మూడో వన్డే

శ్రేయస్‌ అయ్యర్‌ 66 పరుగులు, విరాట్‌ కోహ్లీ 65 పరుగులతో రాణించినప్పటికీ, మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, గస్‌ అట్కిన్సన్‌ తలో మూడు వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్‌ను కుదిపేశారు. సాకిబ్‌ మహ్మూద్‌ రెండు వికెట్లు సాధించి వారికి మంచి సహకారం అందించాడు.

భారత బౌలర్లలో గర్నూర్‌ బ్రార్‌ రెండు వికెట్లు తీయగా, జస్‌ప్రీత్‌ బుమ్రా, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇప్పుడు ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌ గెలవడంతో సిరీస్‌ సమంగా నిలిచింది. జులై 19న లార్డ్స్‌లో జరిగే మూడో వన్డేలో విజేత ఎవరో తేలనుంది.

ADVERTISEMENT