ఉత్తమ అథ్లెట్‌గా ఏపీ అమ్మాయి
జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో ఉత్తమ మహిళా అథ్లెట్‌గా ఏపీ అమ్మాయి జ్యోతి యర్రాజి నిలిచింది. 100 మీటర్ల పరుగులతో పాటు 100 మీటర్ల హర్డిల్స్ లోనూ ఆమె స్వర్ణాలు గెలిచింది. అదే విధంగా భారత అగ్రశ్రేణి షాట్ ఫుట్ అథ్లెట్ తజిందర్ పాల్ తన పేరిటే ఉన్న ఆసియా రికార్డును మెరుగుపర్చడంతో పాటు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ కూ అర్హత సాధించడం విశేషం. 28 ఏళ్ల ఈ పంజాబ్ అథ్లెట్ సోమవారం గుండును 21.77 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సాధించాడు. ఈ నేపథ్యంలో 2021లో తానే నెలకొల్పిన ఆసియా రికార్డు (21.49మీ)ను అతను అధిగమించడం గమనార్హం.
లాంగ్ జంప్ లో బంగారు పతకాన్ని సాధించిన మురళీ శ్రీశంకర్
మరోవైపు తజిందర్ పాల్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ (21.40మీ), ఆసియా క్రీడల (19మీ) అర్హత మార్కునూ అందుకున్నాడు. లాంగ్ జంప్ లో స్టార్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్(కేరళ) 8.29 మీటర్ల ఉత్తమ ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల లాంగ్ జంప్ లో ఆన్సీ సోజన్ (కేరళ- 6.51 మీ), షౌలి సింగ్ (ఉత్తరప్రదేశ్-6.49bw) కూడా ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. మహిళల జావెలిన్ త్రోలో అన్నురాణి (58.22మీ) పసిడితో పాటు ఆసియా క్రీడల బెర్తు ఖరారు చేసుకుంది.