Kabo Verde: స్వాతంత్ర్య వేడుకలతో పాటు వరల్డ్‌కప్ హీరోలకు కాబో వెర్డే ఘన స్వాగతం
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్రికా ఖండంలోని ద్వీప దేశం కాబో వెర్డేలో ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి. అట్లాంటిక్ మహాసముద్రంలోని ద్వీప సమూహంగా ఉన్న ఈ దేశం ఆదివారం తన 51వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఇదే రోజున ఫిఫా ప్రపంచకప్‌లో చారిత్రక ప్రదర్శనతో ఆకట్టుకున్న జాతీయ ఫుట్‌బాల్ జట్టు స్వదేశానికి చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సంబురాలు రెట్టింపయ్యాయి. విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పోర్చుగీసు పాలన నుంచి జూలై 5న స్వాతంత్ర్యం పొందిన కాబో వెర్డేలో ప్రతి ఏడాది ఈ తేదీని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
వివరాలు
తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన కాబో వెర్డే జట్టు
అయితే ఈసారి దేశ ఫుట్‌బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్‌లో చేసిన అద్భుత ప్రదర్శనతో స్వాతంత్ర్య వేడుకలకు మరో ప్రత్యేక ఆకర్షణ జతైంది. తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన కాబో వెర్డే జట్టు సంచలన ఆటతో అందరి ప్రశంసలు అందుకుంది. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించిన ఆ జట్టు 32వ రౌండ్ వరకు దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. నాకౌట్ దశలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో అదనపు సమయంలో నమోదైన గోల్‌తో అర్జెంటీనా 3-2 తేడాతో విజయం సాధించినా, కాబో వెర్డే ఆటగాళ్ల పోరాట పటిమ ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల ప్రశంసలు అందుకుంది.
వివరాలు
చరిత్రలో నిలిచిన గోల్స్
అమెరికా,కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచకప్‌లో కాబో వెర్డే తరఫున తొలి ప్రపంచకప్ గోల్ నమోదు చేసిన ఆటగాడిగా కెవిన్ పినా చరిత్ర సృష్టించాడు. అలాగే అర్జెంటీనాపై అదనపు సమయంలో గోల్ సాధించిన సిడ్నీలోపెస్ కాబ్రల్ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈఇద్దరి ప్రదర్శనతో పాటు మొత్తం జట్టు ఆటతీరు కాబోవెర్డే అభిమానుల్లో అపారమైన గర్వాన్ని నింపింది. 32వరౌండ్‌లోనే టోర్నీకి వీడ్కోలు పలికినప్పటికీ,తమ ప్రదర్శనతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్న జట్టు ఆటగాళ్లు స్వాతంత్ర్య దినోత్సవమైన జూలై 5నే స్వదేశానికి చేరుకున్నారు. దీంతో ఒకేరోజు స్వాతంత్ర్య వేడుకలు,వరల్డ్‌కప్ హీరోల స్వాగతం కలిసి కాబో వెర్డే ప్రజలకు మరపురాని పండుగగా మారాయి. దేశమంతా ఆనందోత్సాహాలతో మార్మోగిపోగా,ఫుట్‌బాల్ వీరులను ప్రజలు ఘనంగా సత్కరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫిఫా ప్రపంచకప్‌లో ఆకట్టుకున్న జట్టుకు కాబో వెర్డేలో ఘన స్వాగతం
‼️🇨🇻 LA SELECCIÓN DE CABO VERDE YA LLEGÓ A SU PAÍS pic.twitter.com/6efQBKa7Qh
— Avellaneda_Real (@avellaneda_real) July 5, 2026