IPL Auction: ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు కీలక అప్‌డేట్.. ఆటగాళ్ల జాబితాకు డెడ్‌లైన్ ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం (IPL Auction 2027) డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో వేలం ప్రక్రియకు సంబంధించి తాజాగా కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకున్న (రిటైన్), వదులుకున్న (రిలీజ్) ఆటగాళ్ల జాబితాలను నవంబర్ 15లోగా సమర్పించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అన్ని జట్లకు సూచించింది. ఫ్రాంఛైజీలు ఈ జాబితాలను సమర్పించిన తర్వాత ప్రతి జట్టులో ఎంతమంది ఆటగాళ్లు ఉన్నారు? ఇంకా ఎన్ని స్లాట్లు ఖాళీగా ఉన్నాయి? అనే విషయాలపై స్పష్టత రానుంది. ఆ తర్వాత ఆయా జట్ల నుంచి విడుదలైన ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు.
వివరాలు
ఇండియాలో ఆటగాళ్ల వేలం
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్ల ప్రాథమిక జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు ఫ్రాంఛైజీలకు అందజేస్తారు.
ఆ జాబితాను పరిశీలించిన జట్లు తమకు అవసరమైన ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేస్తాయి. అనంతరం తుది వేలంలో పాల్గొనే ఆటగాళ్ల వివరాలను వెల్లడిస్తారు.
మరోవైపు మూడు సీజన్ల విరామం తర్వాత ఐపీఎల్ ఆటగాళ్ల వేలం భారత్‌లో జరగనుండటం విశేషం. గతంలో 2024లో దుబాయ్‌లో, 2025లో జెడ్డాలో, 2026లో అబుధాబిలో వేలం నిర్వహించారు.
ఈసారి గోవా వేదికగా వేలం జరగనుండటంతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమ జట్ల కూర్పుపై ఎలా ముందుకెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.