KL Rahul: కేకేఆర్‌పై రాహుల్ విధ్వంసం. 593 పరుగులతో రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన రికార్డులతో ముగించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఈ భారీ స్కోర్‌లో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. వేగంగా ఆడిన అతడు 60 పరుగులతో జట్టుకు బలమైన స్కోర్ అందించాడు. అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, అక్షర్ పటేల్‌లతో కలిసి ముఖ్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
వివరాలు
ఆరంభంలోనే ఢిల్లీకి షాక్..
టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీకి ఆరంభంలోనే అభిషేక్ పోరెల్ వికెట్ కోల్పోయినా, పవర్‌ప్లే ముగిసే సరికి 53/1తో నిలిచింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ గేర్ మార్చాడు. ముఖ్యంగా సునీల్ నరైన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదుతూ దూకుడు పెంచాడు. మరోవైపు సాహిల్ పరాఖ్ వికెట్ కోల్పోయినప్పటికీ, కార్తిక్ త్యాగిపై బౌండరీలు బాదుతూ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. జట్టు స్కోర్‌ను 110 దాటించిన తర్వాత అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మొత్తం 30 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు.
వివరాలు
అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ..
ఈ సీజన్‌లో రాహుల్‌కు ఇది ఆరో 50కి పైగా స్కోర్. వికెట్ కీపర్‌గా ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే రికార్డును అతడు 2018లో కూడా నమోదు చేశాడు. రిషభ్ పంత్ (2018), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (2026) కూడా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే ఐపీఎల్‌లో రాహుల్ ఇది 51వ హాఫ్ సెంచరీ. దీంతో రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 76 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా, డేవిడ్ వార్నర్ 66, శిఖర్ ధావన్ 53 అర్ధ సెంచరీలతో ముందున్నారు.
వివరాలు
కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు..
ఐపీఎల్ 2026 సీజన్‌లో కేఎల్ రాహుల్ మొత్తం 14 మ్యాచ్‌ల్లో 593 పరుగులు చేశాడు. అతడి సగటు 45.61 కాగా, స్ట్రైక్ రేట్ 174.41గా నమోదైంది. ఇది అతడి ఐపీఎల్ కెరీర్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ కావడం విశేషం. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై అజేయంగా 152 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. వరుసగా మూడో ఐపీఎల్ సీజన్‌లో 500కి పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 159 మ్యాచ్‌ల్లో 5,815 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కూడా రాహుల్ మంచి రికార్డు కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు కేకేఆర్‌పై 20 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అతడు 605 పరుగులు చేశాడు.