LOADING...
Team India: కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

Team India: కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2026
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా క్రికెట్‌లో యువ ఆటగాళ్ల నుంచి వస్తున్న తీవ్ర పోటీ జట్టును మరింత బలోపేతం చేస్తోంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లపై సానుకూల ఒత్తిడి పెరిగింది. దీంతో రాబోయే ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లో సెలెక్టర్లు సీనియర్ల అనుభవాన్ని నమ్ముతారా? లేక ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లకు మరింత ప్రాధాన్యం ఇస్తారా? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ ఆదివారం ఇంగ్లాండ్ పర్యటనలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించింది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, శ్రేయాస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.

వివరాలు

యశస్వీ జైస్వాల్ కు దక్కని చోటు

ఈ నిర్ణయంతో వన్డే క్రికెట్‌లో టీమిండియా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టైంది. జట్టులో మరో ప్రధాన ఆకర్షణగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంపికయ్యారు. అయితే విరాట్ కోహ్లీ తుది ఎంపిక ఆయన ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. ఇదే సమయంలో అద్భుత ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఈ సిరీస్‌లో చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. వికెట్‌కీపర్‌లుగా కె.ఎల్. రాహుల్, ఇషాన్ కిషన్‌లకు అవకాశం లభించింది. ఆల్‌రౌండర్ విభాగంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డికి కూడా స్థానం కల్పించారు.

వివరాలు

భారత్ - ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్

స్పిన్ విభాగాన్ని కుల్దీప్ యాదవ్ నడిపించనుండగా, ఫాస్ట్ బౌలింగ్ దళానికి జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. అతనితో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్‌లు కూడా జట్టులో చోటు సంపాదించారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జూలైలో జరగనుంది. తొలి వన్డే జూలై 14న (మంగళవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభమవుతుంది. రెండో వన్డే జూలై 16న (గురువారం) సాయంత్రం 5:30 గంటలకు సోఫియా గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. చివరి వన్డే జూలై 19న (ఆదివారం) మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం నిర్వహించబడతాయి.

Advertisement

వివరాలు

ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు వైభవ్ సూర్యవంశీ ఎంపిక

ఇక ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు సంబంధించి కూడా బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. టాటా ఐపీఎల్ 2026 సందర్భంగా ఎడమ కాలికి గాయపడిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందుతున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆయన ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా టీ20 స్క్వాడ్‌లో యువ సంచలనం, రికార్డుల వీరుడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం లభించింది. కాగా, తిలక్ వర్మను జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు. యువ ప్రతిభకు మరింత ప్రాధాన్యం ఇస్తున్న భారత జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement