Krunal Pandya: మ్యాచ్ గెలిపించిన కృనాల్ ఎమోషనల్ కామెంట్స్.. టీ20లో అతనే GOAT!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ జోరు కొనసాగిస్తోంది. ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరి బంతికి విజయం సాధించిన బెంగళూరు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి మరింత చేరువైంది. 39/3తో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్య 46 బంతుల్లో 73 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్‌లతో చెలరేగిన అతడు కాలు పట్టేసినా వెనక్కి తగ్గకుండా పోరాడి జట్టును విజయానికి దగ్గర చేశాడు. చివరి మూడు బంతులకు 9 పరుగులు అవసరమైన సమయంలో భువనేశ్వర్ కుమార్ బాదిన సిక్స్‌తో ఆర్సీబీ విజయం ఖాయమైంది.
వివరాలు
కఠిన పరిస్థితుల్లో ఆడటమే తనకు ఇష్టం
మ్యాచ్ అనంతరం మాట్లాడిన కృనాల్ పాండ్య మాట్లాడారు. కఠిన పరిస్థితుల్లో ఆడటమే తనకు ఇష్టమని తెలిపాడు. అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానన్నాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తీవ్ర కండరాల నొప్పులతో ఇబ్బంది పడ్డానని, పిక్కల నుంచి మొదలైన నొప్పి వీపు వరకు వెళ్లిందని వెల్లడించాడు. ఇకపై మరింత ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ ఆడిన షాట్‌నే హైలైట్‌గా అభివర్ణించిన కృనాల్.. ఇది సంప్రదాయ క్రికెట్ షాట్లు ఆడాల్సిన పిచ్ అని వివరించాడు. ఇలాంటి వికెట్‌పై పూర్తి ఏకాగ్రతతో పాటు ఎంతో ఓర్పు అవసరమని పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్‌తో గడిపిన రోజులను కూడా కృనాల్ గుర్తు చేసుకున్నాడు.
వివరాలు
పోలార్డ్ పై ప్రశంసలు
కీరన్ పొలార్డ్ తనకు పెద్ద అన్నయ్యలాంటి వాడని చెప్పిన అతడు.. ముంబయి తరఫున ఆరేళ్లు అద్భుత అనుభవాలు పొందానన్నాడు. తాను, హార్దిక్ పాండ్య, పొలార్డ్ కలిసి జట్టుకు వెన్నెముకలా నిలిచామని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణిస్తూ ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించామని చెప్పాడు. 2021లో తాము ముగ్గురం కలిసి చివరి మ్యాచ్ ఆడిన సందర్భం ఇప్పటికీ మర్చిపోలేనిదని కృనాల్ భావోద్వేగంగా గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం ముగ్గురం చేతులు పట్టుకుని 'ఇకపై కలిసి ఆడేది ఇదే చివరిసారి కావచ్చు' అని అనుకున్న క్షణం ఇప్పటికీ గుర్తుండిపోయిందన్నాడు. పొలార్డ్‌పై తనకు అపారమైన ప్రేమ, గౌరవం ఉందని చెప్పిన కృనాల్.. టీ20 ఫార్మాట్‌లో అతడే అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు.