LOADING...
IPL 2026 : ఒక్కో పరుగుకు రూ.9 లక్షలు.. పంత్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు
ఒక్కో పరుగుకు రూ.9 లక్షలు.. పంత్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు

IPL 2026 : ఒక్కో పరుగుకు రూ.9 లక్షలు.. పంత్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు

వ్రాసిన వారు Moogati Shabari
May 28, 2026
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే సరికి లక్నో సూపర్జెయింట్స్ జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది. వరుసగా మూడో ఏడాది కూడా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. ఈ సీజన్ లీగ్ దశ పూర్తయ్యేసరికి లక్నో జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారీ అంచనాలతో రూ.27 కోట్లకు రిషబ్ పంత్‌ను తీసుకున్న జట్టు యజమాని సంజీవ్ గోయెంకాకు ఈ సీజన్ చేదు అనుభవంగా మారింది. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన లక్నో జట్టు కేవలం నాలుగు విజయాలకే పరిమితమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. పాయింట్లు ముంబయి ఇండియన్స్‌తో సమానంగా ఉన్నప్పటికీ, నెట్ రన్‌రేట్ బలహీనంగా ఉండటంతో లక్నో అట్టడుగు స్థానానికి చేరుకుంది.

వివరాలు

నిరాశపరిచిన రిషబ్ పంత్..

ఈ సీజన్‌లో లక్నో ప్రదర్శన నిరాశపరిచినా, రిషబ్ పంత్ అందుకున్న పారితోషికం మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది. వేలంలో రూ.27 కోట్లకు ఎంపికైన అతడు, 14 మ్యాచ్‌లకు మ్యాచ్ ఫీజుల రూపంలో మరో రూ.1.05 కోట్లు పొందాడు. ఇలా పన్నులు, ఇతర కోతలు మినహాయిస్తే, ఒక్క ఐపీఎల్ 2026 సీజన్ ద్వారానే అతని ఆదాయం రూ.28.05 కోట్లకు చేరింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు కొనుగోలైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. అయితే అంత భారీ మొత్తం ఖర్చు చేసినప్పటికీ, పంత్ నుంచి ఆశించిన స్థాయి ప్రదర్శన మాత్రం కనిపించలేదు. బ్యాటర్లకు అనుకూలంగా మారిన ఆధునిక టీ20 క్రికెట్‌లో అతని స్ట్రైక్ రేట్ 138.05 మాత్రమే ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి.

వివరాలు 

టోర్నీ మొత్తానికి ఒకే ఒక్క హాఫ్ సెంచరీ..

టోర్నమెంట్ ప్రారంభంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌పై చేసిన అజేయ 68 పరుగుల ఇన్నింగ్స్ తప్పితే, మిగతా ఏ మ్యాచ్‌లోనూ అతడు అర్ధశతకం నమోదు చేయలేకపోయాడు. మొత్తంగా 14 మ్యాచ్‌ల్లో 13 ఇన్నింగ్స్ ఆడిన పంత్, 28.36 సగటుతో కేవలం 312 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్‌గా జట్టు అవసరాల పేరుతో నంబర్ 3, నంబర్ 4, ఓపెనర్ వంటి పలు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావడం వల్ల జట్టు సమతౌల్యం దెబ్బతిన్నదనే విమర్శలు వచ్చాయి. వికెట్ కీపర్‌గా మాత్రం ఈ సీజన్‌లో 10 క్యాచ్‌లు అందుకున్నాడు. రిషబ్ పంత్‌కు చెల్లించిన మొత్తం రూ.28.05 కోట్లను, అతడు చేసిన 312 పరుగులతో పోల్చి లెక్కిస్తే ఆశ్చర్యకరమైన గణాంకం బయటపడింది.

Advertisement

వివరాలు

కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశం..

ఈ సీజన్‌లో పంత్ చేసిన ప్రతి పరుగుకు లక్నో సూపర్ జెయింట్స్ దాదాపు రూ.8.99 లక్షలు ఖర్చు చేసినట్టైంది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఆటగాడి ఒక్కో పరుగుకు ఇంత భారీ మొత్తం వెచ్చించడం అరుదైన విషయంగా మారింది. పంత్ బ్యాటింగ్ ప్రతిభపై సంజీవ్ గోయెంకాకు నమ్మకం ఉన్నప్పటికీ, అతని కెప్టెన్సీ, వ్యూహాలపై జట్టు యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. జట్టు డైరెక్టర్ టామ్ మూడీ ఇప్పటికే జట్టులో మార్పులు అవసరమని సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పంత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, ఒత్తిడి లేకుండా ప్రత్యేక బ్యాటర్‌గా ఆడించే దిశగా లక్నో యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement