IND vs SA: గౌహతి టెస్ట్‌లో 51 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన మార్కో జాన్సెన్
ఈ వార్తాకథనం ఏంటి
సౌతాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ గౌహతి టెస్ట్‌లో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్లలో అత్యధిక సిక్స్‌లు బాదిన ఏకైక బ్యాటర్‌గా ఆయన చరిత్రకెక్కాడు. అంతేకాక భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక బ్యాటర్‌గా అత్యధిక సిక్స్‌లు కొట్టిన రికార్డును కూడా అతడు తిరగరాశాడు. ఈ క్రమంలో 51 ఏళ్ల నాటి వివ్ రిచర్డ్స్ రికార్డ్‌ను జాన్సెన్ అధిగమించాడు. గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జాన్సెన్, ముత్తుసామితో కలిసి 9వ వికెట్‌కు 97 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. కేవలం 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 పరుగులు చేసి శతకం అంచున ఆగిపోయాడు.
Details
6 సిక్స్‌లు కొట్టి ఆ రికార్డ్ సమం
ఈ ఇన్నింగ్స్‌లో వచ్చిన 7 సిక్స్‌లు అతనికి పలు చారిత్రక గుర్తింపులను తెచ్చిపెట్టాయి. టెస్ట్ చరిత్రలో 9వ స్థానంతో పాటు దిగువ బ్యాటింగ్ స్థానాల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా జాన్సెన్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో అతడి తర్వాత ఆండీ బ్లిగ్నూ(6), మైఖేల్ హోల్డింగ్(6), వసీమ్ అక్రమ్(5), మిచెల్ జాన్సన్(5), మార్క్ వుడ్(5), మోయిన్ అలీ(5), నొమన్ అలీ(5) ఉన్నారు. భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన పర్యాటక బ్యాటర్‌గా ఉన్న వివ్ రిచర్డ్స్ 51ఏళ్ల రికార్డు కూడా ఈ మ్యాచ్‌లో బద్దలైంది. 1974లో ఢిల్లీలో వివ్ రిచర్డ్స్ 6 సిక్స్‌లు బాదగా, 2001లో మాథ్యూ హెడెన్ చెన్నైలో 6 సిక్స్‌లు కొట్టి ఆ రికార్డ్‌ను సమం చేశాడు.
Details
7 సిక్సర్లతో రికార్డు
అయితే జాన్సెన్ గౌహతిలో 7 సిక్స్‌లు బాది ఈ ఇద్దరి రికార్డులను అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెనరన్ ముత్తుసామి 206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109 పరుగులు చేసి శతకం సాధించగా, జాన్సెన్ 93 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4/115తో నాలుగు వికెట్లు తీసాడు. జస్‌ప్రీత్ బుమ్రా (2/75), మహ్మద్ సిరాజ్ (2/106), రవీంద్ర జడేజా (2/94) చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్, తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది.