SA vs NZ: మార్‌క్రమ్ మెరుపులు.. కివీస్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. 176 పరుగుల ప్రొటీస్ జట్టు సులువుగా చేధించింది. సూపర్-8 బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ అడమ్ మార్క్రరమ్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగా, మార్కో జాన్సన్ బంతితో కివీస్‌ను కట్టడి చేశాడు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ (31) మెరుపు ఆరంభం ఇచ్చినా, మరోవైపు టిమ్ సీఫెర్ట్ (13), రచిన్ రవీంద్ర (13) త్వరగా ఔటయ్యారు.
Details
రాణించిన మార్కో జాన్సన్
కేవలం 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో మార్క్ చాప్ మన్ (48), డారిన్ మిచెల్ (32) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో 200 పరుగులు చేసేలా కనిపించిన కివీస్‌ను మార్కో జాన్సన్ (4/40) తన పదునైన బౌలింగ్‌తో అడ్డగించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 175 పరుగులకే పరిమితమైంది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ ఊహించని వేగంతో ఆరంభం ఇచ్చాడు. తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడి, కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.
Details
సౌతాఫ్రికా తరుపున వేగవంతమైన హాఫ్ సెంచరీ
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో దక్షిణాఫ్రికా తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మూడో ఓవర్ ముగిసేసరికి జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. డికాక్ (20) తోడ్పాటు అందించగా, మార్‌క్రమ్ 44 బంతుల్లో 86 పరుగులు (8 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (24 నాటౌట్) తనదైన శైలిలో సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. దక్షిణాఫ్రికా కేవలం 17.1ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్టేడియానికి తరలివచ్చిన సుమారు 56 వేల మంది ప్రేక్షకులు మార్‌క్రమ్ వీర విహారాన్ని ఆస్వాదించారు. ఈ విజయంతో గ్రూప్-డిలో వరుసగా మూడు గెలుపులు సాధించిన దక్షిణాఫ్రికా సూపర్-8 రేసులో అగ్రస్థానంలో నిలిచింది.