Lionel Messi: అర్జెంటీనా ఓటమిపై మెస్సీ ఎమోషనల్ లెటర్.. అభిమానులకు ప్రత్యేక లేఖ!
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమి పాలైన తర్వాత ఆ జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ తొలిసారి స్పందించాడు. వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను గెలవాలన్న తన కల నెరవేరకపోవడంతో ఫైనల్ ముగిసిన వెంటనే మైదానంలోనే చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. మెస్సీ భావోద్వేగాన్ని చూసిన అభిమానులు కూడా కంటతడి పెట్టారు. ఫైనల్ ముగిసిన మరుసటి రోజు మెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. ఈ ఫలితం ఎంతో బాధ కలిగించింది. ఈ గాయం మానడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఏది జరిగినా అది మంచి కోసమే జరుగుతుందనే నమ్మకం నాకు ఉందంటూ తన మనసులోని భావాలను వ్యక్తం చేశాడు.
వివరాలు
ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా గుర్తింపు
అంతేకాదు ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్‌లోనూ మేము ప్రాణం పెట్టి ఆడామని భావిస్తున్నాం. అర్జెంటీనా ప్రజలు ప్రతి క్షణం మాకు అండగా నిలిచారు.
వారి ప్రోత్సాహమే మమ్మల్ని ఫైనల్ వరకు తీసుకువచ్చింది. జట్టు మొత్తం కష్టపడి, సమష్టిగా పోరాడి అర్జెంటీనాను ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలబెట్టిందని నేను గర్వంగా చెప్పగలను.
ఈరోజు ఓటమి బాధలో ఉన్నందున ఆ విజయాలను గుర్తుచేసుకోవడం కాస్త కష్టంగా అనిపిస్తోందని పేర్కొన్నాడు.
ఇంకా మాట్లాడుతూ.. వరుసగా రెండు ఫిఫా ప్రపంచకప్‌ల్లో అర్జెంటీనా ఫైనల్‌కు చేరడం చిన్న విషయం కాదు.
ఈ ప్రయాణంలో మాకు మద్దతుగా నిలిచిన అర్జెంటీనా అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మమ్మల్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
వివరాలు
అర్జెంటీనా గౌరవాన్ని నిలబెట్టుకోవాలి
మనమంతా ఎప్పటికీ ఐక్యంగా ఉండి అర్జెంటీనా గౌరవాన్ని నిలబెట్టుకుందాం.
అలాగే ప్రపంచకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు నా ప్రత్యేక అభినందనలంటూ తన లేఖను ముగించాడు. 2026 ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాను మరోసారి మెస్సీ ముందుండి నడిపించాడు.
ప్రీ-క్వార్టర్ ఫైనల్ వరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లో కనీసం ఒక్క గోల్ అయినా నమోదు చేస్తూ తన జట్టుకు అండగా నిలిచాడు. మొత్తం టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి 8 గోల్స్, 4 అసిస్టులతో అద్భుత ప్రదర్శన చేసి గోల్డెన్ బూట్ రేసులో నిలిచాడు.
చివరకు8 గోల్స్‌తో సిల్వర్ బూట్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే ఫైనల్లో స్పెయిన్ దుర్భేద్యమైన డిఫెన్స్, కట్టుదిట్టమైన వ్యూహాల ముందు అర్జెంటీనా దాడులు ఫలించలేదు.
వివరాలు
రిటెర్మెంట్ పై పెద్దఎత్తున్న చర్చ
ప్రత్యర్థి ఆటగాళ్ల ఒత్తిడిలో మెస్సీ కూడా తన ముద్ర వేయలేకపోయాడు.
ఒకవేళ ఈసారి అర్జెంటీనా ప్రపంచకప్‌ను గెలిచి ఉంటే.. ఆ విజయంతోనే మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికేవాడన్న చర్చలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం తన రిటైర్మెంట్‌పై ఆయన ఎలాంటి ప్రకటన చేయకపోయినా, 2030 ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అదే నిజమైతే.. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఒక స్వర్ణయుగానికి త్వరలోనే ముగింపు పలికినట్టే అవుతుంది.