MI vs RCB : రాయ్‌పూర్‌లో హైటెన్షన్ ఫైట్.. ముంబై వ్యూహాల్లో కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం (మే 10) రాయ్‌పూర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు కీలక పోరులో తలపడనున్నాయి. ఈ హైటెన్షన్ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ శిబిరం నుంచి అభిమానులకు ఒక శుభవార్త, మరో ఆందోళనకర సమాచారం బయటకు వచ్చింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ జట్టుతో కలవనున్నప్పటికీ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందుబాటుపై ఇంకా స్పష్టత రాలేదు. కొద్ది రోజులుగా సూర్యకుమార్ యాదవ్ క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మే 7న ఆయన భార్య దేవిషా శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో సూర్య తండ్రిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కుటుంబంతో సమయం గడపాలనే ఉద్దేశంతో ఆయన గత మ్యాచ్‌కు దూరమయ్యారు.
వివరాలు
మళ్లీ కెప్టెన్‌గా సూర్య..
అయితే ఆర్సీబీతో జరిగే కీలక పోరుకు సూర్య తిరిగి జట్టులో చేరనున్నట్లు ముంబై ఇండియన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ విషయానికి వస్తే, పరిస్థితి ఇంకా అనిశ్చితిగానే ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా ఆయన ఆడలేదు. ప్రస్తుతం హార్దిక్ ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిరంతరం పరిశీలిస్తోందని జట్టు యాజమాన్యం తెలిపింది. ముంబై జట్టుతో కలిసి ఎయిర్‌పోర్టులో హార్దిక్ కనిపించకపోవడంతో అభిమానుల్లో సందేహాలు మరింత పెరిగాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌కు కూడా హార్దిక్ దూరమైతే, సూర్యకుమార్ యాదవ్ మళ్లీ జట్టును నడిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వివరాలు
రోహిత్ శర్మపై భారీ అంచనాలు..
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ లేకపోవడం ముంబై జట్టుపై ప్రభావం చూపించింది. అయితే ఇప్పుడు సూర్యకుమార్ తిరిగి రావడంతో బ్యాటింగ్ విభాగానికి మరింత బలం చేకూరనుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశమున్న రాయ్‌పూర్ పిచ్‌పై ఆర్సీబీ బౌలింగ్ దాడిని ఎదుర్కొనేందుకు ముంబై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హార్దిక్ ఆడకపోతే ఆల్‌రౌండర్ స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. అలాగే రోహిత్ శర్మ, రికల్టన్‌ల ఓపెనింగ్ జోడీపై ముంబై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.