MS Dhoni: జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ
జార్ఖండ్‌లో త్వరలో జరగే అసెంబ్లీ ఎన్నికలకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ ఎన్నికల ప్రచారంలో తన ఫొటోలను ఉపయోగించడానికి ధోనీ సమ్మతించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె. రవికుమార్ పేర్కొన్నారు. స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం ద్వారా ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు ధోనీ తన కృషి చేయనున్నట్లు తెలిపారు.
నవంబర్ 23న లెక్కింపు
జార్ఖండ్ అసెంబ్లీకి 81 స్థానాలు ఉండగా, ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్ 13న, మిగిలిన 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలను నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 29,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 5తో జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగుస్తుంది.