RR - MI: ముంబయి ఇండియన్స్ మాస్టర్ ప్లాన్..! యశస్వి కోసం హార్దిక్‌ను వదులుకుంటుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య భవితవ్యంపై విస్తృత చర్చ జరుగుతోంది. హార్దిక్ ముంబయి ఇండియన్స్‌ను వీడి మరో ఫ్రాంచైజీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తుండగా, ఇతర జట్లు ట్రేడ్ డీల్ ద్వారా అతడిని సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు ముంబయి ఇండియన్స్ యాజమాన్యం గానీ, హార్దిక్ పాండ్య గానీ అధికారికంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన వార్త క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఓ కీలక ట్రేడ్ డీల్‌పై చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరందుకుంది.
వివరాలు
యశస్వీ భవిష్యత్తుపై సందిగ్ధత
ఈ డీల్‌లో భాగంగా హార్దిక్ పాండ్యను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చి, ప్రతిఫలంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ముంబయి జట్టులోకి తీసుకురావాలని ముంబయి యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల వరకు భారత క్రికెట్‌లో యశస్వి జైస్వాల్ హాట్ టాపిక్‌గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్‌లో సంజు శాంసన్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు కూడా యశస్వికే వస్తాయని చాలా మంది భావించారు. అయితే ఆ అవకాశం రియాన్ పరాగ్‌కు దక్కింది. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల తర్వాత యశస్వి ప్రభావం కొంత తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టులోనే కొనసాగితే అతడి ఛరిష్మా మరింత తగ్గే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
ముంబయిలో కెప్టెన్సీ సమీకరణాలు
అందుకే ముంబయి ఇండియన్స్‌లో చేరేందుకు యశస్వి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ముంబయి ఇండియన్స్‌లో కూడా కెప్టెన్సీ అంశంపై స్పష్టత లేదు. భవిష్యత్ కెప్టెన్‌గా తిలక్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ, యశస్వి జైస్వాల్ జట్టులోకి వస్తే అతడికి కూడా నాయకత్వ బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
యువ భారత బ్యాటర్లపై ముంబయి దృష్టి
ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ జట్టులో భారత యువ బ్యాటర్లలో తిలక్ వర్మ మాత్రమే స్థిరంగా కనిపిస్తున్నాడు. మరోవైపు సీనియర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శనలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీమ్ ఇండియాలో ఆడుతున్న యువ బ్యాటర్లను జట్టులోకి తీసుకురావాలని ముంబయి మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మ ఐపీఎల్‌కు దూరమైతే, యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు
అలాగే మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మతో పాటు మరో యువ భారత బ్యాటర్ ఉండటం జట్టుకు మరింత బలం చేకూరుస్తుందని ముంబయి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం హార్దిక్ పాండ్య-యశస్వి జైస్వాల్ ట్రేడ్ డీల్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తలపై స్పష్టత రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.