Senuran Muthusamy : 11 ఏళ్లకే తండ్రి కోల్పోయిన ముత్తుసామి… తల్లి ప్రోత్సాహంతో టీమిండియాపై అద్భుత సెంచరీ
ఈ వార్తాకథనం ఏంటి
సౌతాఫ్రికా క్రికెటర్ సెన్యురన్ ముత్తుసామి పేరు భారతీయ క్రికెట్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం కాకపోయినా, గౌహతిలో భారత్‌తో జరుగుతున్న టెస్టులో చేసిన అద్భుత ప్రదర్శనతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్‌కి అత్యంత కష్టమైన పిచ్‌పై, ఏడో స్థానంలో దిగిన ముత్తుసామి బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ వంటి భారత స్టార్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొని అద్భుతమైన సెంచరీని నమోదు చేశాడు. మ్యాచ్ ఫలితం పక్కన పెడితే, ఈ సెంచరీ వెనుక అతని జీవితంలో ఉన్న కష్టం, పట్టుదల మరింత ప్రేరణాత్మకం. ముత్తుసామి భారతీయ మూలాలున్న ఆటగాడు. అతని పూర్వీకులు తమిళనాడులోని నాగాపట్టణం ప్రాంతం నుంచి సౌతాఫ్రికాకు వలస వచ్చిన వారు. ముత్తుసామి పుట్టి పెరిగినది మాత్రం డర్బన్‌లోనే.
Details
తల్లి ప్రోత్సాహాంతో ముందుకు
చిన్నప్పటి నుంచే క్రికెట్‌కు ప్రోత్సాహం ఇచ్చినది అతని తండ్రే. అయితే ముత్తుసామి 11 ఏళ్లు నిండక ముందే తండ్రి మరణించడంతో, అతన్ని ఒంటరిగా పెంచిన బాధ్యత తల్లి వాణి మూడ్లిపై పడింది. తన భర్త కలను నెరవేర్చడమే లక్ష్యంగా వాణి తన కొడుకు క్రికెటర్ కావడానికి ఎంత కష్టమైనా భరించింది. తల్లి వాణి కేవలం ఆర్థికంగా కాకుండా, క్రికెట్‌లోనూ అతనికి మార్గదర్శకురాలయ్యారు. ముందుగా క్రికెట్ ఆటను నేర్చుకుని, ముత్తుసామి బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నప్పుడు వీడియోలు తీసి వాటిని చూసుకుంటూ లోపాలను సరిచేసేలా సహాయం చేసేవారు. ఒక చాంపియన్‌ను తయారు చేయడంలో ఆమె పాత్ర అనిర్వచనీయం.
Details
పలు రికార్డులు నమోదు
తండ్రి కల అయిన సౌతాఫ్రికా జట్టులో ఆడడం — ముత్తుసామి 2019లో విశాఖపట్నంలో జరిగిన టెస్టులో భారత్‌పై అరంగేట్రం చేస్తూ ఆ కలను నిజం చేశాడు. ఇప్పుడు మళ్లీ అదే భారత్‌పై తొలి టెస్ట్ సెంచరీ చేయడం అదొక అరుదైన సంయోగం. ఈ సెంచరీ కేవలం వ్యక్తిగత రికార్డు మాత్రమే కాదు; పలు కొత్త మైలురాళ్లను కూడా నెలకొల్పింది. 15 సంవత్సరాల్లో భారత్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసి టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాళ్లు కేవలం ఇద్దరే. 2019లో క్వింటన్ డి కాక్, ఇప్పుడు ముత్తుసామి. అలాగే భారత్‌లో ఆరేళ్ల తర్వాత టెస్ట్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ కూడా ముత్తుసామినే. అంతకుముందు 2019లో డీన్ ఎల్గార్ ఈ ఘనత సాధించారు.
Details
అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన
అదేవిధంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ మూడు ఆసియా దేశాల్లో 50 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన నాలుగో దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా ముత్తుసామి నిలిచాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు టెంబా బావుమా, మార్క్ బౌచర్, గ్రేమ్ స్మిత్ మాత్రమే ఉన్నారు. తండ్రి కలను మోస్తూ, తల్లి అండతో ముందుకు సాగిన సెన్యురన్ ముత్తుసామి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. కష్టాలను జయించి ఎదిగిన అతని ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.