Mohammed Nabi: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్గాన్ ఆటగాడిగా నబీ నయా రికార్డు
అఫ్గాన్ ప్లేయర్ మహమ్మద్ నబీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో మహమ్మద్ నబీ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచులో నబీ 32 బంతుల్లో 65 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో 5వేల పరుగుల మార్కును అందుకున్నాడు. అదే విధంగా ఈ మ్యాచు ద్వారా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. కేవలం 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేసిన తొలి ఆఫ్గాన్ బ్యాటర్ గా కూడా నబీ రికార్డును సృష్టించాడు. గత నెలలో ముజీర్ ఉర్ రెహ్మాన్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ రికార్డును అతను బద్దలు కొట్టాడు.
ఆఫ్గాన్ తరుఫున 259 మ్యాచులాడిన నబీ
ఆఫ్గాన్ తరుఫున 259 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన నబీ 24.56 సగటుతో 5011 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 21 హాఫ్ సెంచరీలున్నాయి. ఆప్ఘనిస్తాన్‌కు చెందిన మహ్మద్ షహజాద్ 156 మ్యాచులలో 4,811 పరుగులు, అస్గర్ ఆఫ్గన్ 195 మ్యాచుల్లో 4246 పరుగులు చేసి నబీ తర్వాతి స్థానంలో నిలిచారు. నబీ 147 వన్డేల్లో 3, 153 పరుగులు, 109 టీ 20 మ్యాచులలో 1825 పరుగులు చేశాడు.