Loading...
Pakistan Cricket Team: పాకిస్థాన్ టీ20 జట్టుకు కొత్త కెప్టెన్.. సల్మాన్ అలీ ఆఘాకు షాక్!
పాకిస్థాన్ టీ20 జట్టుకు కొత్త కెప్టెన్.. సల్మాన్ అలీ ఆఘాకు షాక్!

Pakistan Cricket Team: పాకిస్థాన్ టీ20 జట్టుకు కొత్త కెప్టెన్.. సల్మాన్ అలీ ఆఘాకు షాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2026
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ టీ20 జట్టుకు నూతన పూర్తిస్థాయి కెప్టెన్‌గా సాహిబ్జాదా ఫర్హాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు జట్టుకు నాయకత్వం వహించిన సల్మాన్ అలీ ఆఘా స్థానంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఫర్హాన్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇటీవల ముగిసిన 2026 ఆసియా క్రీడల్లోనూ పాకిస్థాన్ జట్టుకు ఫర్హానే సారథ్యం వహించారు. అయితే, ఆ టోర్నీలో ఫైనల్‌కు చేరిన పాక్ జట్టు.. భారత్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు ఫర్హాన్ మీడియాతో మాట్లాడారు. స్వదేశంలో జరిగే సిరీస్‌లో పాకిస్థాన్ జట్టుకు నాయకత్వం వహించడం తనకు ఎంతో గౌరవంగా ఉందని చెప్పారు. కెప్టెన్‌గా తన ముందున్న కొత్త సవాల్‌ను ఎదుర్కొనేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

వివరాలు

కెప్టెన్సీపై ఒత్తిడి ఉంటుంది.. కానీ అనుభవం ఉంది!

కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడంలో కొంత ఒత్తిడి ఉంటుందని సాహిబ్జాదా ఫర్హాన్ అంగీకరించారు. జట్టును ముందుండి నడిపించాల్సి రావడంతో తన ఆలోచనా విధానంలోనూ మార్పు అవసరమని పేర్కొన్నారు.

కెప్టెన్‌గా వ్యవహరించేటప్పుడు విభిన్నమైన మైండ్‌సెట్‌తో ఉండాల్సి ఉంటుందని వివరించారు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో తనకు నాయకత్వం వహించిన అనుభవం ఉందని ఫర్హాన్ తెలిపారు.

ఆ అనుభవం జట్టును ఎలా నడిపించాలనే విషయంలో తనకు స్పష్టతనిచ్చిందని చెప్పారు. తాను ఎప్పుడో ఒకరోజు పాకిస్థాన్ జాతీయ జట్టుకు కెప్టెన్ అవుతానని ఎప్పుడూ ఊహించలేదని భావోద్వేగంగా వెల్లడించారు.

తన తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పటికైనా నిజమవుతాయని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

వివరాలు

దూకుడుగా ఆడటమే లక్ష్యం!

ప్రస్తుత పాకిస్థాన్ జట్టుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఫర్హాన్ చెప్పారు. జట్టులోని సీనియర్ ఆటగాళ్ల అనుభవం మైదానంలో ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

టీ20 క్రికెట్‌లో తమ జట్టు మరింత దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ఫఖర్ జమాన్, మాజ్ సదాకత్, హసన్ నవాజ్ వంటి ఆటగాళ్ల బ్యాటింగ్ శైలి కూడా తన తరహాలోనే దూకుడుగా ఉంటుందని ఫర్హాన్ పేర్కొన్నారు.

తాను ఆశించిన విధంగా పటిష్టమైన జట్టు అందుబాటులో ఉందని, ఈ ఆటగాళ్లతో జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

వివరాలు

అక్టోబర్ 9 నుంచి పాక్‌-శ్రీలంక టీ20 సిరీస్

పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. రావల్పిండి ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. సిరీస్ షెడ్యూల్ ఇలా ఉంది.

తొలి టీ20: అక్టోబర్ 9

రెండో టీ20: అక్టోబర్ 11

మూడో టీ20: అక్టోబర్ 13

కొత్త పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సాహిబ్జాదా ఫర్హాన్‌కు ఈ సిరీస్ కీలకంగా మారనుంది.

స్వదేశంలో శ్రీలంకతో జరిగే ఈ పోటీల్లో ఆయన నాయకత్వంలో పాకిస్థాన్ జట్టు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనే దానిపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT