Badminton Team: యూరప్ టూర్‌కు నో ఫండింగ్.. సొంత డబ్బులతో బరిలోకి దిగిన భారత షట్లర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
యూరోపియన్ బ్యాడ్మింటన్ టూర్‌లో భారత షట్లర్లు అద్భుత ప్రదర్శన చేశారు. స్టార్ ఆటగాళ్లు పీవీ సింధు, లక్ష్య సేన్ పతకాలు సాధించి సత్తా చాటారు. అయితే ఈ టూర్‌కు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కీలక విషయం తీవ్ర చర్చకు దారితీసింది. ఐరోపా పర్యటనలో పాల్గొన్న భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నిధులు విడుదల చేయలేదని సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
వివరాలు
సాయ్ నుంచి నిధులు రాక.. సొంత ఖర్చులతో టోర్నీలు
యూరప్ టూర్‌లో భాగంగా భారత బ్యాడ్మింటన్ బృందం ఫిన్‌లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీల్లో జరిగిన టోర్నమెంట్లలో పాల్గొంది.
అయితే ఈ పోటీల్లో ఆడేందుకు సాయ్ నుంచి ఆటగాళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని తెలుస్తోంది.
అక్టోబర్ 6న ప్రారంభమైన ఆర్కిటిక్ ఓపెన్‌కు కొద్ది రోజుల ముందే నిధులు విడుదల చేయడం లేదనే విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆటగాళ్లకు తెలియజేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు తగిన సమయం లేక షట్లర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.
చివరకు తమ సొంత ఖర్చులతోనే టోర్నీల్లో పాల్గొనాల్సి వచ్చిందని తెలుస్తోంది.
ఫిన్‌లాండ్‌లో జరిగిన తొలి టోర్నమెంట్‌కు సంబంధించిన వసతి సౌకర్యాలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) కల్పించింది.
వివరాలు
ప్రయాణ ఖర్చులు కూడా ఎక్కువే
అయితే, మిగతా టోర్నీల విషయంలో ఆ సంఘం ఆర్థిక సహాయం అందించలేదని కథనాలు వెల్లడించాయి.
దీంతో ప్రయాణం, వసతి, ఆహారం వంటి ఖర్చులను ఆటగాళ్లే భరించాల్సి వచ్చింది. ప్రయాణ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో కొందరు షట్లర్లు తమ కోచ్‌లను కూడా వెంట తీసుకెళ్లలేకపోయారు.
అష్మిత చలీహా, తన్వి శర్మ తమ కోచ్‌లు లేకుండానే పోటీల్లో పాల్గొన్నట్లు సమాచారం.
వివరాలు
ఆసియా గేమ్స్ ఫలితాలే నిధుల నిలిపివేతకు కారణమా?
ఇటీవల జపాన్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ బృందం నిరాశపరిచింది. కనీసం ఒక్క విభాగంలోనూ భారత్‌కు పతకం దక్కలేదు.
2014 తర్వాత ఆసియా గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టుకు ఒక్క మెడల్ కూడా రాకపోవడం ఇదే తొలిసారి. దీంతో ఆటగాళ్ల ప్రదర్శనపై సాయ్ అసంతృప్తి వ్యక్తం చేసిందనే వార్తలొచ్చాయి.
ఈ కారణంగానే యూరప్ టూర్‌కు నిధులు విడుదల చేయలేదనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే, ఈ ప్రచారాన్ని సాయ్ అధికారులు తోసిపుచ్చినట్లు తాజా కథనాలు పేర్కొన్నాయి.
టోర్నమెంట్‌కు 30 రోజుల ముందుగానే అందులో పాల్గొనే ఆటగాళ్ల వివరాలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమర్పించి, నిధుల కోసం ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని సాయ్ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.
వివరాలు
నిధులు విడుదల చేయడం లేదు
నిర్ణీత గడువులోగా బీఏఐ నుంచి ప్రతిపాదనలు అందకపోవడం వల్లే నిధులు విడుదల చేయలేదని సాయ్ వర్గాలు స్పష్టం చేసినట్లు కథనాలు తెలిపాయి.
రాబోయే టోర్నీల కోసం నిధులను తిరిగి పునరుద్ధరించామని, అయితే యూరప్ టూర్‌లో ఆటగాళ్లు తమ సొంతంగా ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదని స్పోర్ట్స్ అథారిటీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ పరిణామాలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపారు. నిధులు విడుదల కాలేదనే విషయం తెలిసి షాక్‌కు గురయ్యానని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
నిధులు లేకున్నా పోటీల్లో పాల్గొన్నా: పీవీ సింధు
అయితే, ఆర్థిక సహాయం అందితేనే టోర్నీల్లో పాల్గొనాలని తాను ఎప్పుడూ భావించలేదని స్పష్టం చేశారు.
నిధులు రాలేదని తెలిసి ఆశ్చర్యపోయా. కానీ, అవి ఉంటేనే ఆడాలని నేనేం నిర్ణయించుకోలేదు. నా వరకు పోటీల్లో పాల్గొని నన్ను నేను మెరుగుపర్చుకోవడమే ముఖ్యం.
అందుకోసం కొంత ఖర్చును సొంతంగా భరించా'' అని సింధు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.
ఈ యూరప్ టూర్ ఆరంభంలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో పీవీ సింధు ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.
ఇక జర్మనీలో జరిగిన హైలో ఓపెన్‌లో పీవీ సింధు, లక్ష్య సేన్ విజేతలుగా నిలిచారు. ఇలా నిధుల కొరత మధ్య కూడా భారత షట్లర్లు పతకాలు సాధించడం విశేషం.