India vs Pakistan: భారత్-పాక్ ఫైనల్లోనూ 'నో హ్యాండ్‌షేక్'.. మరోసారి దూరంగానే కెప్టెన్లు!
ఈ వార్తాకథనం ఏంటి
ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లోనూ టీిమిండియా, పాకిస్థాన్ మధ్య 'నో-హ్యాండ్ షేక్' సీన్ రిపీట్ అయింది. శనివారం (అక్టోబర్ 3) జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడగా.. టాస్ సమయంలో రెండు జట్ల కెప్టెన్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా చేసుకోలేదు. కొంతకాలంగా ఆసియా కప్ నుంచి ఐసీసీ టోర్నీల వరకు భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ల్లో కనిపిస్తున్న ఈ ధోరణి.. ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లోని అత్యంత కీలకమైన పసిడి పోరులోనూ కొనసాగడం గమనార్హం. ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో శ్రీలంకపై భారత్ 124 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. మరోవైపు బంగ్లాదేశ్‌ను ఓడించిన పాకిస్థాన్ తుది సమరానికి అర్హత సాధించింది.
వివరాలు
మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
దీంతో గోల్డ్ మెడల్ కోసం భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి ముఖాముఖి తలపడ్డాయి.
ఈ మహా సంగ్రామంలో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
అయితే టాస్ సమయంలో శ్రేయస్ అయ్యర్, పాకిస్థాన్ కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ మధ్య కొన్ని మాటలు నడిచాయి.
కానీ ఇద్దరూ దగ్గరకు వచ్చి పరస్పరం షేక్ హ్యాండ్ చేసుకోలేదు. కాస్త దూరంగానే ఉంటూ మాట్లాడుకున్నారే తప్ప.. చేతులు కలపలేదు.
దీంతో భారత్-పాక్ క్రికెట్ మధ్య కొనసాగుతున్న 'నో-హ్యాండ్ షేక్' వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ స్పందనలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్‌ను టీమిండియా కరివేపాకులా తీసి పారేసిందంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.
వివరాలు
ఇతర క్రీడల్లో మాత్రం షేక్‌హ్యాండ్..
ఇక ఈ ఏషియన్ గేమ్స్‌లోని ఇతర క్రీడలను పరిశీలిస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.
టేబుల్ టెన్నిస్ మ్యాచ్‌ల్లో భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు మ్యాచ్ ముగిసిన తర్వాత ఎంతో సాధారణంగా పరస్పరం చేతులు కలుపుకున్నారు.
అలాగే హాకీ సెమీఫైనల్లోనూ ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ మైదానంలో ఆత్మీయంగా పలకరించుకున్న ఫొటోలు బయటకొచ్చాయి.
అయితే క్రికెట్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ 'నో-హ్యాండ్ షేక్' సంప్రదాయం కొనసాగుతుండటం గమనార్హం.
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ల్లో ఇటీవల కనిపిస్తున్న ఈ పరిణామం.. ఇప్పుడు ఏషియన్ గేమ్స్ వేదికపైనా కనిపించింది.
వివరాలు
షేక్‌హ్యాండ్‌పై ఎలాంటి తప్పనిసరి నిబంధన లేదు..
నిజానికి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) కానీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) కానీ ఆటగాళ్లు తప్పనిసరిగా చేతులు కలపాలని ఎలాంటి నిబంధన విధించలేదు.
అయితే క్రీడాస్ఫూర్తికి, ఆటగాళ్ల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి సంకేతంగా మ్యాచ్ అనంతరం లేదా పోటీకి ముందు చేతులు కలుపుకోవడం ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది.
వివరాలు
మహిళల క్రికెట్‌లో మాత్రం భిన్నమైన దృశ్యం..
ఇదిలా ఉండగా.. ఏషియన్ గేమ్స్ నుంచి వచ్చిన మరో ఆసక్తికరమైన చిత్రం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.
అంతకుముందు జరిగిన మహిళల క్రికెట్ విభాగంలో భారత మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. పాకిస్థాన్ మహిళల జట్టు బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది.
ఈ టోర్నీలో మహిళల విభాగంలో భారత్, పాకిస్థాన్ జట్లు పరస్పరం తలపడలేదు. అయినప్పటికీ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో రెండు జట్ల క్రీడాకారిణులు ఒకే పోడియంపై కలిసి కనిపించారు.
కానీ ఇప్పుడు పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచ్ టాస్ సమయానికి వచ్చేసరికి భారత్-పాకిస్థాన్ క్రికెట్ మధ్య కొనసాగుతున్న 'నో-హ్యాండ్ షేక్' అధ్యాయం మరోసారి తెరపైకి వచ్చింది.
ఏషియన్ గేమ్స్ వేదికగా ఈ పరిణామం మరోసారి హైలైట్ అయింది.