Loading...
India vs Afghanistan: టాస్ కూడా పడలేదు.. నేరుగా సెమీస్‌కు టీమిండియా
టాస్ కూడా పడలేదు.. నేరుగా సెమీస్‌కు టీమిండియా

India vs Afghanistan: టాస్ కూడా పడలేదు.. నేరుగా సెమీస్‌కు టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2026
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏషియన్ గేమ్స్‌ 2026 పురుషుల క్రికెట్‌లో టీమిండియా-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ఇవాళ జరగాల్సిన రెండో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తడి ఔట్‌ఫీల్డ్‌ కారణంగా రద్దైంది. టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో మెరుగైన ర్యాంకింగ్‌ ఆధారంగా భారత్‌ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇదే టోర్నీలో అంతకుముందు పాకిస్తాన్‌-హాంగ్‌కాంగ్‌ చైనా మధ్య జరగాల్సిన తొలి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లోనూ టాస్‌ వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో మెరుగైన ర్యాంకింగ్‌ ఆధారంగా పాకిస్తాన్‌ కూడా సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది.

వివరాలు

పాపం ఆఫ్ఘనిస్తాన్‌.. గత ఎడిషన్‌లోనూ ఇంతే!

ఆసియా క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు కనీసం పోరాడే అవకాశం కూడా దక్కకుండా పోతోంది. గత ఎడిషన్‌ ఫైనల్లోనూ ఆ జట్టు టైటిల్‌ కోసం పోరాడే ప్రయత్నాన్ని వరుణుడు అడ్డుకున్నాడు.

ఆ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దు కావడంతో ఆఫ్ఘనిస్తాన్‌ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 2026 ఏషియన్ గేమ్స్‌లోనూ ఆఫ్ఘనిస్తాన్‌కు అదే పరిస్థితి ఎదురైంది.

భారత్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కనీసం ఒక్క బంతి కూడా ఆడే అవకాశం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి ఆ జట్టుకు కనీసం కాంస్య పతకం కూడా దక్కలేదు.

మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన భారత్‌ ఈసారి కూడా మరో అడుగు ముందుకేసింది. మ్యాచ్‌ రద్దు కావడంతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

వివరాలు

అక్టోబర్‌ 1న సెమీఫైనల్స్

అక్టోబర్‌ 1న జరిగే రెండో సెమీఫైనల్‌లో భారత్‌.. బంగ్లాదేశ్‌-మలేషియా మధ్య జరిగే క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో తలపడనుంది.

అదే రోజు జరిగే తొలి సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌.. శ్రీలంక-నేపాల్‌ మధ్య జరిగే క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ విజేతను ఎదుర్కోనుంది.

రెండు సెమీఫైనల్స్‌లో విజయం సాధించే జట్లు అక్టోబర్‌ 3న స్వర్ణ పతకం కోసం జరిగే ఫైనల్‌లో తలపడతాయి.

సెమీఫైనల్స్‌లో ఓటమి పాలైన జట్లు కూడా అదే రోజు కాంస్య పతకం కోసం పోటీపడతాయి.

ADVERTISEMENT