ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తా చాటిన నొవాక్ జొకోవిచ్
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తాచాటాడు. బుధవారం మార్టన్ ఫుక్సోవిక్స్ పై వరుస సెట్లతో విజయం సాధించి మూడోవ రౌండ్‌లోకి ప్రవేశించాడు. తొలి సెట్‌ను గెలవడానికి జొకోవిచ్‌కు గంట 30 నిమిషాల సమయం పట్టింది. మార్టన్ ఫుక్సోవిక్స్ పై 7-6 (2), 6-0, 6-3 స్కోరుతో పురుషుల సింగిల్స్ లో విజయం సాధించాడు. ఈ విజయం తర్వాత జకోవిచ్ ప్యారిస్‌లో జరిగే మూడో రౌండ్‌లో స్పెయిన్ ఆటగాడు అలెజాండ్రో డేవిడోవిచ్ ఫోకినాతో తలపడనున్నాడు. జకోవిచ్ రోలాండ్ గారోస్‌లో 3వ రౌండ్‌కు చేరుకోవడం వరుసగా ఇది 18వ సారి కావడం విశేషం. జకోవిచ్ అంతకుముందు రెండుసార్లు గెలిచిన విషయం తెలిసిందే.
మహిళ సింగిల్స్ విభాగంలో కరోలిన్ గార్సియా ఓటమి
మహిళల సింగిల్స్ విభాగంలో కరోలిన్ గార్సియా ఓటమిపాలైంది. గార్సియా 6-4, 3-6, 5-7తో ప్రపంచ 56వ ర్యాంకర్ అనా బ్లింకోవా చేతిలో పరాజయం పాలైంది. వరుసగా నాలుగో ఏడాది ఈ టోర్నీలో ఆడుతున్న బ్లింకోవా ఐదుసార్లు గార్సియా సర్వీస్ బ్రేక్ చేసి రెండోసారి మూడో రౌండ్ లోకి అడుగుపెట్టింది. 17వ ర్యాంకర్ ఎలెనా ఒస్టాపెంకో కూడా రెండో రౌండ్ లోనే నిష్ర్కమించింది. ఒస్టాపెంకో 3-6, 6-1, 2-6తో పేటన్ స్టెర్న్స్ చేతిలో ఓడిపోయింది.