LOADING...
New Zealand Tour: 2027 వరల్డ్‌కప్‌ దృష్ట్యా కీలక నిర్ణయం.. భారత్‌-న్యూజిలాండ్‌ సిరీస్‌లో వన్డేలు పెరుగుతాయా?
భారత్‌-న్యూజిలాండ్‌ సిరీస్‌లో వన్డేలు పెరుగుతాయా?

New Zealand Tour: 2027 వరల్డ్‌కప్‌ దృష్ట్యా కీలక నిర్ణయం.. భారత్‌-న్యూజిలాండ్‌ సిరీస్‌లో వన్డేలు పెరుగుతాయా?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అభిమానులకు శుభవార్త. ఇప్పటికే టెస్ట్‌,టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పి, ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలకు మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో భారత జట్టు మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం ఆ సిరీస్‌లో 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్‌ మ్యాచ్‌లు నిర్వహించాలనే ప్రణాళిక ఉంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని, వన్డే మ్యాచ్‌ల సంఖ్యను 3 నుంచి 5కు పెంచాలని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు బీసీసీఐకి ప్రతిపాదన పంపింది.

వివరాలు  

వాణిజ్యపరంగా లాభాలు

ఈ సూచనకు బీసీసీఐ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే ఒకవేళ వన్డేలను 4 మ్యాచ్‌లకు పెంచితే, టీ20 మ్యాచ్‌ల సంఖ్యను 3కు తగ్గించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, వన్డే మ్యాచ్‌ల సంఖ్య పెరగడం దాదాపు ఖరారైనట్టేనని క్రికెట్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వన్డే మ్యాచ్‌లు పెరగడం రెండు దేశాల క్రికెట్‌ బోర్డులకు కూడా వాణిజ్యపరంగా లాభదాయకంగా మారే అవకాశముంది. ముఖ్యంగా రోహిత్‌ శర్మ,విరాట్‌ కోహ్లి వంటి స్టార్‌ ఆటగాళ్లు ఎక్కువ మ్యాచ్‌ల్లో కనిపిస్తే ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరుగుతుంది. దాంతో న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డుకు భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

వివరాలు 

ఐపీఎల్‌ తర్వాత వన్డేలపై దృష్టి

అదే సమయంలో, రాబోయే వన్డే ప్రపంచకప్‌కు ముందు రోహిత్‌, కోహ్లి వంటి కీలక ఆటగాళ్లకు మరింత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కూడా లభిస్తుంది. అందువల్ల న్యూజిలాండ్‌ పర్యటనలో వన్డే సిరీస్‌ను విస్తరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్‌ 2026 సీజన్‌ మే నెల చివర్లో ముగిసిన వెంటనే భారత జట్టు దృష్టి పూర్తిగా వన్డే ప్రపంచకప్‌ సన్నాహాలపై కేంద్రీకృతం కానుంది. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో బిజీగా ఉన్న టీమిండియా, జూన్‌ మొదటి వారం నుంచి వన్డే క్రికెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. దీంతో రాబోయే అంతర్జాతీయ టోర్నీలకు జట్టు మరింత సమర్థంగా సిద్ధమవుతుందని భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

ఐపీఎల్‌ 2026 తర్వాత భారత వన్డే క్యాలెండర్

- జూన్‌లో ఆఫ్ఘానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు - జూలైలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌లు - ఆగస్టులో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌లు - అక్టోబర్‌లో న్యూజిలాండ్‌ పర్యటన - సంవత్సరం చివర్లో శ్రీలంకతో మూడు మ్యాచ్‌లు

Advertisement