LOADING...
Smriti Mandhana Wedding: మంధానతో మా సోదరుడి వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు: పలాక్‌ ముచ్చల్‌ 
మంధానతో మా సోదరుడి వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు: పలాక్‌ ముచ్చల్

Smriti Mandhana Wedding: మంధానతో మా సోదరుడి వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు: పలాక్‌ ముచ్చల్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళా క్రికెట్‌ జట్టు స్టార్‌ ఆటగాళ్లలో ఒకరైన స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం అనుకోని పరిస్థితుల వల్ల వాయిదా పడింది. పెళ్లి వేడుకల మధ్యలోనే మంధాన తండ్రికి గుండెపోటు లక్షణాలు కనిపించడంతో, వెంటనే ఆయనను సాంగ్లీలోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పెళ్లిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంధాన నిర్ణయించిందని, ఆమె మేనేజర్ వెల్లడించారు. అసలు ఈ వివాహం ఆదివారం జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగా, పలాశ్ ముచ్చల్ సోదరి, గాయని పలాక్ ముచ్చల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పోస్ట్ చేస్తూ, ఇరు కుటుంబాల గోప్యతను కాపాడాలని అభిమానులకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

అందుకే వివాహం నిరవధికంగా వాయిదా

"మంధాన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను సాంగ్లీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం తగదు అని మంధాన భావించింది. అందుకే వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది" అని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితమే వివాహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మెహందీ, హల్దీ, సంగీత్ వంటి వేడుకలు ఆనందంగా జరిగాయి. ఈ వేడుకలకు భారత మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, షెఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ లు హాజరై సందడి చేశారు.

వివరాలు 

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పలాశ్

ఆదివారం రాత్రి పలాశ్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. వైరల్ ఇన్ఫెక్షన్‌, అసిడిటీ కారణంగా అసౌకర్యం కలిగిందని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం పలాశ్‌ ఆరోగ్యం మెరుగై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు సమాచారం. ఈ మొత్తం పరిస్థితిపై పలాక్ ముచ్చల్ ఇచ్చిన వ్యాఖ్యల్లో, "స్మృతి మంధాన తండ్రి అనారోగ్యం కారణంగా, మంధాన-పలాశ్ వివాహం ప్రస్తుతం నిలిపివేయబడింది. ఈ సున్నితమైన సమయంలో ఇరు కుటుంబాల ప్రైవసీకి అందరూ గౌరవం చూపాలని కోరుతున్నాం" అని పేర్కొన్నారు.