LOADING...
PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ప్రత్యేక భేటీ.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ భాగస్వామ్యానికి కొత్త రోడ్‌మ్యాప్
భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ భాగస్వామ్యానికి కొత్త రోడ్‌మ్యాప్

PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ప్రత్యేక భేటీ.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ భాగస్వామ్యానికి కొత్త రోడ్‌మ్యాప్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 10, 2026
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెల్‌బోర్న్‌లోని చారిత్రాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)ను సందర్శించారు. ఈ సందర్భంగా యువ క్రికెటర్లతో ఆత్మీయంగా ముచ్చటించిన ఆయన, భారత్-ఆస్ట్రేలియా మధ్య క్రీడా సహకారాన్ని మరింత విస్తరించే ఇండియా-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్ను అధికారికంగా ఆవిష్కరించారు.

వివరాలు

ఎంసీజీ సందర్శనపై ప్రధాని భావోద్వేగ వ్యాఖ్యలు..

ఎంసీజీలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోడీ, ప్రతి భారతీయుడికి ఈ మైదానం ఎంతో ప్రత్యేకమని అన్నారు. ఈ స్టేడియంలో అడుగుపెట్టిన ప్రతిసారీ భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ పోరాటాల ఉత్సాహం ఒకవైపు గుర్తుకు వస్తే, మరోవైపు క్రికెట్ రెండు దేశాల ప్రజల జీవితాల్లో కేవలం ఆటగా కాకుండా భావోద్వేగంగా, అభిమానంగా నిలిచిందనే విషయం గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ రోజు మాత్రం చివరి ఓవర్ ఉత్కంఠ, గెలుపోటముల ఒత్తిడి లేవని, ఆట పట్ల ఉన్న ప్రేమ, భారత్-ఆస్ట్రేలియా స్నేహబంధం, భవిష్యత్ క్రీడా ఛాంపియన్ల ఉత్సాహమే కనిపిస్తోందని ప్రధాని మోడీ చెప్పారు.

వివరాలు

క్రీడా రంగంలో విస్తృత సహకారానికి శ్రీకారం..

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ సమక్షంలో స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ, ఈ భాగస్వామ్యం కేవలం క్రికెట్‌కే పరిమితం కాదని స్పష్టం చేశారు. వివిధ క్రీడల్లో ఇరు దేశాలు పరస్పరం కలిసి పనిచేసేలా ఈ కార్యాచరణ రూపొందించబడిందని తెలిపారు. ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా క్రీడాకారుల శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్, అత్యాధునిక క్రీడా సాంకేతికత, యువ ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేయడం, క్రీడా మౌలిక సదుపాయాల బలోపేతం వంటి కీలక రంగాల్లో భారత్-ఆస్ట్రేలియా పరస్పర సహకారాన్ని మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

వివరాలు

రెండు దేశాలను కలిపిన క్రికెట్ బంధం..

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో జరిగిన ప్రతి సమావేశంలోనూ క్రికెట్ సహజంగానే చర్చకు వస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. గతంలో అహ్మదాబాద్‌లోని స్టేడియాన్ని ఇద్దరూ కలిసి సందర్శించిన సందర్భాన్ని గుర్తుచేశారు. మెల్‌బోర్న్‌లో మాజీ క్రికెట్ దిగ్గజాలు స్టీవ్ వా, లిసా స్టాలేకర్ సమక్షంలో ఉండడం తనకు మరింత ఆనందాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ, అక్కడి ప్రతిపక్ష నాయకుడు అంగస్ టేలర్‌తో కూడా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు.

Advertisement

వివరాలు

18 కీలక ఒప్పందాలతో మరింత బలపడిన ద్వైపాక్షిక సంబంధాలు..

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించాలనే విషయంలో ఆస్ట్రేలియాలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నింటి నుంచి విస్తృత మద్దతు లభిస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జూలై 8న ఆస్ట్రేలియాకు చేరుకున్న ప్రధాని మోడీ మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. మొత్తం 18 ఒప్పందాలు కుదిరిన ఈ సహకారంలో పౌర అణుశక్తి, సముద్ర భద్రత, కీలక ఖనిజాల అభివృద్ధి, రక్షణ రంగ సహకారం, ఇంధన భద్రత, సైబర్ సెక్యూరిటీ, కీలక సాంకేతికతలు, సరఫరా గొలుసుల బలోపేతం వంటి వ్యూహాత్మక రంగాలు ప్రధానంగా చోటు చేసుకున్నాయి.

Advertisement