
CSK : పృధ్వీ షాకు షాకిచ్చిన చైన్నై.. 17 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా విఫలమవుతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదింటిలో ఓటమిని చవిచూసింది.
దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. జట్టులో సరైన కాంబినేషన్ దొరక్క తడబడుతున్న సీఎస్‌కే తాజాగా ఓ యువ సంచలన ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ముంబయికి చెందిన 17 ఏళ్ల యువ ఓపెనర్ ఆయుష్ మాత్రేను జట్టులోకి తీసుకున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది.
రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయం కారణంగా టోర్నీకి దూరమైన నేపథ్యంలో అతని స్థానాన్ని భర్తీ చేయడానికి మ్యానేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
చెన్నై ఫ్రాంచైజీ అతడిని వెంటనే జట్టులో చేరమని కోరినప్పటికీ, మరో రెండు రోజుల్లో జట్టులో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Details
మెగా వేలంలో ఎవ్వరూ కొనలేదు.. ఇప్పుడైతే లక్కీ
2025 మెగా వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్న ఆయుష్ మాత్రేను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. కానీ, ఇప్పుడు సీఎస్‌కేకు అతని సేవలు అవసరమయ్యాయి.
ప్రస్తుతం చెన్నై జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడేందుకు లక్నోలోని ఎకానా స్టేడియంలో ఉంది.
ఏప్రిల్ 15న లక్నోతో మ్యాచ్, అలాగే ఏప్రిల్ 20న ముంబై ఇండియన్స్‌తో వాంఖడేలో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో, ఆయుష్ మాత్రే ఆ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇతర ప్లేయర్ల ట్రయల్స్ కూడా
సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఇటీవల గుజరాత్‌కు చెందిన ఉర్విల్ పటేల్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సల్మాన్ నిజార్ లను ట్రయల్స్ కోసం పిలిపించింది.
Details
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన ఆయూష్ మాత్రే
అంతేకాకుండా మెగావేలంలో అమ్ముడుపోని పృథ్వీ షా పేరు కూడా రుతురాజ్ స్థానంలో పరిశీలనలో ఉందనే వార్తలు వెలువడ్డాయి. అయితే చివరికి ఆయుష్ మాత్రేకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
అత్యంత తక్కువ వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆయుష్ మాత్రే ఇప్పటివరకు 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 504 పరుగులు చేశాడు.
ఇందులో రెండు శతకాలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అలాగే 7 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 458 పరుగులు సాధించాడు, ఇందులో కూడా రెండు శతకాలు ఉన్నాయి. ఈ గణాంకాలే అతనికి ఇప్పుడీ అవకాశం తెచ్చిపెట్టినట్టు కనిపిస్తోంది.