PV Sindhu: ముగిసిన సింధు పోరాటం.. గాయపడినా అద్భుత విజయం సాధించిన చైనా షట్లర్
ఈ వార్తాకథనం ఏంటి
సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్టార్ షట్లర్ పి.వి. సింధు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో పతకం సాధించకుండానే ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు 11-21, 21-15, 17-21 తేడాతో ప్రపంచ నంబర్ 3 షట్లర్ వాంగ్ జి యి (చైనా) చేతిలో ఓటమిపాలైంది. చివరి గేమ్‌లో గాయంతో తీవ్రంగా ఇబ్బందిపడినప్పటికీ వాంగ్ జి యి ఆటను కొనసాగించి అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి గేమ్‌లో సింధు ఆరంభంలో చైనా షట్లర్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఓ దశలో ఇద్దరూ 7-7తో సమంగా నిలిచారు. అయితే ఆ తర్వాత వాంగ్ జి యి జోరు పెంచడంతో సింధు వెనుకబడిపోయింది.
వివరాలు
నడవడానికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి..
రెండో గేమ్‌లో సింధు అద్భుతంగా పుంజుకుంది. 8-5తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అయితే వాంగ్ జి యి పట్టువదలకుండా పోరాడి స్కోరును 15-15తో సమం చేసింది.
ఈ దశలో సింధు తన అనుభవాన్ని చూపించింది. వరుసగా ఆరు పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది.
ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు 7-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వాంగ్ జి యి తిరిగి పుంజుకుని స్కోరును 9-9తో సమం చేసింది.
దీంతో మ్యాచ్ హోరాహోరీగా మారింది. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు.
చివరకు స్కోరు 16-16 వద్ద ఉన్న సమయంలో వాంగ్ జి యి గాయపడింది.
నడవడానికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ ఆమె ఆటను కొనసాగించింది.
వివరాలు
రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ట్రీసా-గాయత్రి ద్వయం..
గాయం బాధిస్తున్నప్పటికీ వాంగ్ జి యి పోరాటం ఆపలేదు. 19-17తో ఆధిక్యంలోకి వెళ్లిన సమయంలో మరోసారి గాయం నొప్పితో కిందపడిపోయింది.
ఆ తర్వాత మళ్లీ లేచి నిలబడి ఆటను కొనసాగించింది. చివరికి నాలుగు పాయింట్ల తేడాతో గెలుపొందింది.
గాయాన్ని లెక్కచేయకుండా చివరి వరకు పోరాడిన చైనా షట్లర్ తీరును భారత ప్రేక్షకులు సైతం ప్రశంసించారు.
మరోవైపు మహిళల డబుల్స్‌లో భారత జోడీ ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
దీంతో ఈ జోడీ పతకానికి అడుగుదూరంలో నిలిచింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ట్రీసా-గాయత్రి ద్వయం 21-16, 21-12తో రిన్ ఇవానాగా-నకనిషి (జపాన్) జోడీని వరుస గేముల్లో ఓడించింది.
వివరాలు
చైనాకు చెందిన చెన్ ఫాంగ్-గువో జిన్వా చేతిలో ఓటమి..
శుక్రవారం జరగనున్న క్వార్టర్ ఫైనల్‌లో గాయత్రి-ట్రీసా జోడీ ప్రపంచ నంబర్ 4 జాంగ్ షుక్సియన్-జియా యిఫాన్ (చైనా)తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో భారత జోడీ విజయం సాధిస్తే సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడంతో పాటు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటుంది.
పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత ఆటగాడు ఆయుష్ శెట్టి నిరాశపరిచాడు.
ప్రిక్వార్టర్ ఫైనల్‌లో ఇండోనేసియాకు చెందిన అల్వి ఫర్హాన్ చేతిలో 19-21, 11-21తో ఓటమిపాలయ్యాడు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ కూడా రౌండ్ ఆఫ్ 16లోనే నిష్క్రమించింది.
ఈ జోడీ 16-21, 5-21తో చైనాకు చెందిన చెన్ ఫాంగ్-గువో జిన్వా చేతిలో ఓటమిచవిచూసింది.