P.V. Sindhu: జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు శుభారంభం
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పివి.సింధు విజయంతో తన ప్రచారాన్ని ప్రారంభించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో మలేసియాకు చెందిన వాంగ్ లింగ్‌పై 21-14, 21-11 తేడాతో వరుస గేమ్‌ల్లో విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించిన సింధు తొలి గేమ్‌లో 7-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ గేమ్‌ను 21-14తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మరింత దూకుడుగా ఆడిన ఆమె 11-3తో విరామానికి వెళ్లి, ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-11తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా ముగించింది.
వివరాలు
నిరాశపరిచిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ
ఇక పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి నిరాశపరిచింది.
డెన్మార్క్‌కు చెందిన డానియెల్-మాడ్స్ జంటతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో మొదటి గేమ్‌ను 19-21తో కోల్పోయిన అనంతరం, సాత్విక్‌కు భుజం గాయం ఇబ్బందిపెట్టడంతో భారత జంట మ్యాచ్‌ను మధ్యలోనే విరమించుకుంది. దీంతో తొలి రౌండ్ నుంచే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
మరో పురుషుల డబుల్స్ పోరులో హరిహరన్-అర్జున్ జోడీ చైనీస్ తైపీకి చెందిన లీ-యంగ్ జంటతో తలపడింది.
మూడు గేమ్‌ల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట 13-21, 21-17, 7-21 స్కోర్లతో ఓటమి చవిచూసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం భారత్‌కు శుభారంభం లభించింది.
వివరాలు
తొలి రౌండ్ లో గెలుపు
తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల జోడీ స్కాట్లాండ్‌కు చెందిన అలెగ్జాండర్ డన్-జూలీ జంటపై 21-16, 21-4తో సునాయాస విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది.
అయితే మరో భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ రుత్విక శివాని-రోహన్ కపూర్ మాత్రం ఆశించిన ఫలితం సాధించలేకపోయింది.
చైనాకు చెందిన ఫెంగ్-హువాంగ్ జంట చేతిలో 11-21, 10-21తో వరుస గేమ్‌ల్లో ఓడిపోయి టోర్నీకి వీడ్కోలు పలికింది.