KKR: కేకేఆర్ కెప్టెన్సీ రేసులో రహానె ముందంజ.. అయ్యర్‌కు వైస్ కెప్టెన్ పగ్గాలు?
ఐపీఎల్ సీజన్లలో కెప్టెన్ల కోసం చాలా జట్లు గందరగోళానికి గురవుతున్నాయి. ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా అదే సమస్యను ఎదుర్కొంటోంది. గత సీజన్ వరకు జట్టుకు నాయకత్వం వహించిన శ్రేయస్ అయ్యర్‌ను జట్టును తప్పించి, కొత్త కొత్త కెప్టెన్ కోసం అన్వేషిస్తోంది. వేలంలో కోల్‌కతా యాజమాన్యం వెంకటేశ్ అయ్యర్‌ను భారీ మొత్తమైన రూ.23.75 కోట్లకు కొనుగోలు చేయగా, అజింక్య రహానేను రూ.1.5 కోట్ల బేస్ ప్రైజ్‌తో సొంతం చేసుకుంది. తొలుత కెప్టెన్సీ బాధ్యతలు వెంకటేశ్ అయ్యర్‌కు అప్పగిస్తారని భావించినా, అనుభవం ఉన్న రహానె వైపు ఫ్రాంచైజీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. టీమిండియాకు పలు సార్లు నాయకత్వం వహించిన రహానె, తన నైపుణ్యాన్ని ఇప్పటికే నిరూపించాడు.
ముంబై జట్టుకు కెప్టెన్ గా రహానే
ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబయి జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అతని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, రహానెకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించేందుకు కోల్‌కతా 90 శాతం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటేశ్ అయ్యర్ కూడా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే అతడిని వైస్ కెప్టెన్‌గా ఉంచి, రహానెకు పూర్తిస్థాయి నాయకత్వం అప్పగించాలనే ఆలోచనలో కేకేఆర్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక మీడియా కథనం ప్రకారం రహానెను కెప్టెన్సీకి ఎంపిక చేయడం కోసం ప్రత్యేకంగా వేలంలో కొనుగోలు చేసినట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. జట్టులో ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో రహానే అనుభవం కీలకంగా మారనుంది. మరి కేకేఆర్ ఈ కీలక నిర్ణయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందో వేచి చూడాల్సి ఉంది.