WTC Final 2023: డబ్య్లూటీసీ ఫైనల్లో అరుదైన రికార్డులపై రహానే గురి!
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ జూన్ 7 నుంచి ఇంగ్లాండ్ లోని ఓవల్ లో ప్రారంభం కానుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్ కు అర్హత సాధించిన టీమిండియా ప్రస్తుతం ఆ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా లండన్ కు చేరుకుంది. ఐపీఎల్ ఫైనల్ తర్వాత మూడో బ్యాచ్ లో అంజిక్యా రహానే, కేఎస్ భరత్, శుభ్‌మాన్ గిల్, షమీ, రవీంద్ర జడేజా లండన్ కు చేరుకున్నారు. ఐపీఎల్ 2023లో చైన్నై సూపర్ కింగ్స్ తరుపున అంజిక్య రహానే 14 మ్యాచుల్లో 172.49 స్ట్రైక్ రేటుతో 326 పరుగులు చేశాడు. దీంతో రహానేకు మళ్లీ టీమిండియాలో స్థానం కల్పించారు.
రహానే టెస్టుల్లో సాధించిన రికార్డులివే
రహానేకు డబ్య్లూటీసీ ఫైనల్ లో అవకాశం రావడంతో కొన్ని రికార్డులను అతన్ని ఊరిస్తున్నాయి. భారత టెస్టు క్రికెట్లో రహానే ఇప్పటివరకూ 4931 పరుగులు చేశాడు. ఇంకా 69 పరుగులు చేస్తే టెస్టు క్రికెట్లో 5000 పరుగులను పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కనున్నాడు. టెస్టు క్రికెట్లో రహానే 12 సెంచరీలు, 25 అర్ధసెంచరీలున్నాయి. ఇప్పటివరకూ ఆడిన 82 మ్యాచుల్లో 99 క్యాచ్ లను పట్టాడు. ఇంకొక క్యాచ్ పట్టుకుంటే 100 క్యాచ్ లను పూర్తి చేయనున్నాడు. మొత్తంగా రహానే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 12,865 పరుగులు చేయగా.. ఇంకా 135 పరుగులు చేస్తే 13వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. మరోవైపు డబ్య్లూటీసీ ఫైనల్‌లో రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యశస్వీ జైస్వాల్ ను తీసుకున్నట్లు సమాచారం.