టీమిండియాకు ఎంపికైన తర్వాత ఆంజిక్య రహానే ఎమోషనల్ పోస్టు
టెస్టు స్పెషలిస్ట్ గా ముద్రపడిన అంజిక్యా రహానే ఐపీఎల్ 2023 సీజన్లో ఊహించని విధంగా విజృంభిస్తున్నాడు. ఈ సీజన్ లో 199 స్ట్రయిక్ రేటుతో దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించినందుకు రహానేను వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కి ఎంపిక చేశారు. 2021 జనవరిలో టీమిండియాలో చోటు కోల్పోయిన రహానే.. దాదాపు 17 నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు. సీనియర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, పంత్ గాయాలతో దూరం కావడంతో రహానేకి అవకాశం లభించింది. ఆ ఫైనల్ తుది జట్టులోనూ రహానే కచ్చితంగా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రహానే తన లింక్డిన్ ప్రొఫైల్ లో ఎమోషనల్ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కొన్నిసార్లు చాలా నిరాశకు గురయ్యా : అంజిక్యా రహానే
ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ గా తన కెరీర్ లో ప్రయాణం ఎప్పుడూ సాఫీగా జరగలేదని, కొన్నిసార్లు వచ్చిన ఫలితంతో చాలా నిరాశకు గురయ్యాయని, అయితే వచ్చే ఫలితం ఏకాగాత్రను దెబ్బతీయకుండా చూసుకోవాలని రహానే చెప్పాడు. ప్రతికూల సందర్భంలోనూ చాలా విషయాలను నేర్చుకున్నానని, ఒత్తిడిని జయించి నియంత్రణలో ఉండేవాటిపై దృష్టి సారించాలని, మన సామర్థ్యాలే మనల్ని విజయాల వైపు నడిపిస్తాయని సూచించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన రహానే 209 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.